సచివాలయాల ద్వారా 18 లక్షల వినతులు పరిష్కారం

* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

UPDATED 17th NOVEMBER 2020 TUESDAY 7:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): జిల్లాలో సచివాలయాల ద్వారా 18 లక్షల వినతులు పరిష్కరించడం జరిగిందని, ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేటాయించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నియోజకవర్గ స్థాయి అభివృద్ధిపై చేపడుతున్న సమీక్షల్లో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో అవకాశం ఉన్న చోట ప్రభుత్వ భవనాలను గుర్తించి వాటి స్థానంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లను వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిలో పెద్దాపురం నియోజకవర్గం రెండవ స్థానంలో ఉందని, దీనిని ప్రథమ స్థానంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి రూ.920 కోట్లు  ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించిన పేమెంట్ ప్రాసెసింగ్, అవసరం మేరకు సిమెంట్, ఇసుక కొరతను తీర్చడానికి చర్యలు చేపడతామని, నియోజకవర్గంలో డిసెంబరు నాటికి కొన్ని, వచ్చే సంవత్సరం  మార్చి నాటికి పూర్తిస్థాయిలో భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో మిల్క్ బల్క్ సెంటర్ల ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ప్రభుత్వ  యోచనలో ఉందని, వాటికి కూడా స్థలాలను  కేటాయించేందుకు అధికారులు సిద్ధం కావాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు, ఆర్ డబ్యు ఎస్ ఎస్ఈ గాయత్రీదేవి నియోజకవర్గ పరిధిలోని  సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్ , రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు, తదితర అంశాలపై మండల స్థాయి అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. అనంతరం పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నియమించిన ఏడుగురు వార్డు వాలంటీర్లకు కలెక్టర్, ఎమ్మెల్యే, పీఏసీఎస్ అధ్యక్షుల చేతుల మీదుగా నియామక పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా విశ్వనాధ్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, సామర్లకోట పిఏసీఎస్ అధ్యక్షుడు దవులూరి దొరబాబు, జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ, పెద్దాపురం, కాకినాడ ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, చిన్నికృష్ణ, పెద్దాపురం, సామర్లకోట మండలాల తహసీల్దార్లు బూసి శ్రీదేవి, జితేంద్ర, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ కమీషనర్లు జి. సురేంద్ర, ఏసుబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  

 

ads