అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం

జగ్గంపేట, 11 నవంబరు 2020 (రెడ్ బీ న్యూస్): అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. స్థానిక షాదీఖానా ఫంక్షన్‌ హాల్లో బుధవారం రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్‌ అధ్యక్షతన జరిగిన అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దోపిడీ వ్యవస్థను కూలదోసి ఒక నూతన సమసమాజాన్ని స్థాపించాలని దున్నేవారికే భూమి దక్కాలనే నినాదంతో ఈసభను నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అరాచకత్వాన్ని పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. తమ అధికారాన్ని కాపాడుకునేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను హత్య చేస్తున్నారని విమర్శించారు. రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎటుచూసినా అన్యాయాలు, అక్రమాలే జరుగుతున్నాయని, ముఖ్యంగా పేదలు, దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఈ కార్యక్రమానికి రైతు కూలీలు స్థానిక ట్రావెలర్స్‌ బంగ్లా నుంచి సంతమార్కెట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విప్లవ గీతాలు ప్రజలను చైతన్య పరిచాయి. ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణం, వెంకటేశులు, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కడితి సతీష్‌ పాల్గొన్నారు.
ads