ఇరిగేషన్ స్థలాలకు ఎసరు..

* పేదలందరికీ ఇళ్లకు పెద్దాపురంలో రూ. 50 కోట్ల విలువైన స్థలాన్ని ఎంపిక చేసేసిన అధికారులు
* భవిష్యత్ అవసరాలపై దృష్టి సారించని రెవెన్యూ యంత్రాంగం
* పట్టణంలో భవిష్యత్ అవసరాలకు స్థలాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి
* నాలుగు గ్రామాల ప్రజలకు పట్టణ పరిధిలో కేటాయింపులు
* లబ్ధిదారులు వస్తారో రారో సందేహమే...?
* మల్లగుల్లాలు పడుతున్న అధికారులు
* విలువైన స్థలం ఎంపికపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు

UPDATED 12th FEBRUARY 2020 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చే ఉగాదికి పేదలందరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ కేటాయింపు ప్రక్రియ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థల లభ్యత లేకపోవడంతో అధికారులకు ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఓవైపు ఉన్నతాధికారుల ఒత్తిడి, మరోవైపు గడువు దగ్గర పడుతుందడంతో అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం సాధ్యమయినంత వరకు ప్రభుత్వ స్థలాలనే గుర్తించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎంపిక ప్రక్రియ ప్రహసనంగా మారింది. దీంతో ఆయా గ్రామాల్లో స్థలాల ఎంపికపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించే పనిలో తలమునకలైపోయారు. ముఖ్యంగా మెట్ట గ్రామాలకు వచ్చేసరికి ప్రభుత్వ స్థలాల లభ్యత బాగానే ఉన్నా, ఏటిపట్టు ప్రాంతాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. దీంతో పెద్దాపురం మండల పరిధిలో ఏటిపట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థల లభ్యత కనుచూపు మేర కనిపించడం లేదు. దీంతో అధికారులు మూడు, నాలుగు గ్రామాలకు ఒకేచోట స్థలాలను గుర్తించి ఇచ్చే విధంగా నివేదికలు తయారుచేసేశారు.
రూ.50 కోట్ల విలువైన ఇరిగేషన్ స్థలానికి ఎసరు..
పెద్దాపురం పట్టణ పరిధిలో ఉన్న జి.రాగంపేట సర్వే నెంబరు 340/1ఏ1లో సుమారు రూ.50 కోట్ల విలువ చేసే ఐదు ఎకరాల అత్యంత విలువైన ఇరిగేషన్ స్థలాన్ని పేదలందరికీ ఇళ్లు పథకానికి ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక స్థానిక అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇంతటి విలువైన స్థలాన్నిపైఅధికారులు, ప్రజా ప్రతినిధుల మెప్పుకోసం ఇళ్ల స్థలాలకు కేటాయించేశారు. దీంతో పట్టణ ప్రజల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే దీనిపై న్యాయ పోరాటానికి సైతం వెళ్లే ఆలోచనలో పలువులు ఉన్నారు. ఇదిలా ఉండగా పట్టణ పరిధిలో ఉన్న పేదలకు పట్టణానికి సుమారు తొమ్మిది కిలోమీటర్లు దూరంలో ఉన్న రామేశంమెట్ట ప్రాంతంలో స్థలాల కేటాయింపు ప్రక్రియ జరుగుతోంది. అదే కనుక జరిగితే పట్టణ పరిధిలో ఉన్న లబ్దిదారులు రామేశంమెట్టకు వెళ్లేందుకు విముఖత చూపే అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు. అలాగే సిరివాడ, గుడివాడ, పులిమేరు, చదలాడ,తాటిపర్తి జి.రాగంపేట గ్రామాలకు చెందిన లబ్దిదారులు పెద్దాపురం పట్టణ పరిధిలో ఉన్న స్థలాలకు రానున్నారు. అయితే ఇక్కడ మళ్లీ పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. రూరల్ పరిధిలో ఉన్న ప్రజలు గ్రామాలను వదిలి పట్టణంలో జీవనం సాగించేందుకు ఇష్టపడటంలేదు. ఒకవేళ వచ్చినా ఇక్కడ జీవనం సాగించకుండా గ్రామాల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అత్యంత విలువైన స్థలం భవిష్యత్తులో అన్యాక్రాంతం   అయ్యే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. బినామీల పేరుతో కూడా కొంతమంది నాయకులు స్థలాలను కాజేసే యత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం.
భవిష్యత్తు అవసరాలకు స్థల సమస్య..
ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్దాపురం పట్టణంలో అధికారుల అనాలోచిత నిర్ణయంతో భవి
ష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యాలయం నిర్మించాలన్నా ప్రభుత్వ స్థలాల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. పైగా వాటిని నిర్మించేందుకు స్థల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఇంత విలువైన ఇరిగేషన్ స్థలాన్ని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు స్థలాలు ప్రశ్నార్ధకంగా మారనుండడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా ఇటీవల ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో భవిష్యత్తులో కాకినాడ జిల్లాగా మారితే కేవలం జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురం పట్టణం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం లేకపోలేదు. దీంతో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు కేటాయించబోయే ఇరిగేషన్ స్థలంలో ఎంపీడీవో, డీఎస్పీ కార్యాలయాలను నిర్మించింది. అలాగే ఇదే స్థలంలో ఎక్సైజ్, మహిళా శిశు సంక్షేమ, వ్యవసాయ, ఏఎంసీ, సమాచార శాఖ కార్యాలయాలు, అలాగే బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లు, జడ్జి క్వార్టర్లు నిర్మించేందుకు నిర్ణయించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇంతటి విలువైన స్థలాన్ని పేదల ఇళ్లకు కేటాయించడంతో భవిష్యత్తు ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం దొరకడమే కష్టతరంగా మారే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో అధికారుల పునరాలోచన చేయకపోతే ప్రభుత్వ స్థలాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటమే కాకుండా మరింత ప్రజాధనం వెచ్చించి భవిష్యత్ అవసరాలకు స్థలాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. దీంతో ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఎంతమాత్రం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.

 

 

ads