అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలి

UPDATED 13th MAY 2019 MONDAY 10:00 PM

పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 23వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో నియోజకవర్గ అధికారులు, సిబ్బంది తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పెద్దాపురం నియోజకవర్గ అధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వసంత రాయుడు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియకు నియమించిన అధికారులు, వారి సిబ్బంది ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పనిచేయాలని, కాకినాడ జేఎన్టీయూలో జరుగు కౌంటింగ్ రోజున ఉదయం7 గంటలకే కౌంటింగ్ ప్రాంతానికి అధికారులు, సిబ్బంది రావాలని ఆదేశించారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక ఆర్వో అనుమతితో తిరిగి వెళ్లాలని అన్నారు. సెల్ ఫోన్లు, బ్యాగులను కౌంటింగ్ హాలులోకి అనుమతి లేదని, అలాగే భద్రతా సిబ్బందికి కౌంటింగ్ పాస్ చూపిస్తేనే లోపలికి అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో స్ట్రాంగ్ రూములు, ఫలితాలు, రిఫ్రెష్ మెంట్, మీడియా, తదితర కౌంటింగ్ అంశాలు, విధి విధానాలను ఆర్వో తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ పెద్దాపురంకు సంబంధించి నియమించిన రిటర్నింగ్ అధికారి జి. సన్యాసిరావు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కె. గోపాలకృష్ణ, జి. నరసింహారావు, మున్సిపల్ కమీషనర్లు బి.ఆర్. శేషాద్రి, నాగేంద్రకుమార్, ఎంపీడీవోలు కె.స్వప్న, పి. ఉమా మహేశ్వర్రావు, ఈవోపీఆర్డీలు సిహెచ్ జగ్గారావు, కరక హిమ మహేశ్వరి, ఏవో నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

ads