సమైక్యతా శిబిరంతో యువతకు ఎంతో ప్రయోజనం

* జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి

UPDATED 6th SEPTEMBER 2019 FRIDAY 5:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : యువజన సమైక్యతా శిబిరం ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం చేకూరడంతో పాటు మనోవికాసం దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి అన్నారు. స్థానిక టిటిడిసిలో ఈనెల నాల్గవ తేదీ నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి యువజన సమైక్యతా శిబిరంలో భాగంగా మూడవ రోజైన శుక్రవారం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయన వివేకానందుని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ఈ శిబిరానికి హాజరైన యువతీ, యువకులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెట్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజన సమైక్యతా శిబిరం ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, వివిధ ప్రాంతాల కలయిక వల్ల యువత మనోవికాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. అనుభవజ్ఞులైన అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ ప్రతినిధులు వివిధ రంగాలలో వారు సంపాదించిన పరిజ్ఞానం యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. యువత క్రమశిక్షణతో వారు చేపడుతున్న పనులలో ఆసక్తి చూపిస్తే సమాజానికి వారు ఆదర్శప్రాయులవుతారని అన్నారు. సామాజిక అభివృద్ధికి  సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని, అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత తప్పుగా అలవరచుకుంటే నష్టపోతారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్ని వనరులు సమృద్ధిగా ఉన్న జిల్లా అని, జిల్లాలోని ప్రజలకు కష్టపడే మనస్తత్వం ఉందని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ సమైక్యతా శిబిరానికి హాజరైన యువతను, ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న సెట్రాజ్ అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సెట్రాజ్ సీఈవో విజయభాస్కర్, మేనేజర్ కాశీ విశ్వనాధం, మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, సెట్రాజ్ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొన్నారు.

 

 

 

ads