కార్తీకమాస పూజలు ప్రారంభం

UPDATED 29th OCTOBER 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పరమేశ్వరుని పూజించటానికి అత్యంత శ్రేష్ఠమైనదిగా భావించే కార్తీకమాసం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చిన భక్తులు స్వామివారి పుష్కరిణి, గోదావరి కాలువలో పుణ్యస్నానాలు ఆచరించారు. పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన దొరబాబు 108 సార్లు ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నంది మండపంలో ఆలయ అర్చకులు సన్నిధిరాజు సుబ్బన్న, సన్నిధిరాజు వెంకన్న, చెరుకూరి రాంబాబు, కొంతేటి జోగారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు సేపేని సురేష్, బి. వెంకటరమణ గోకాడ రాజా, ఎన్.శ్రీను తదితరులకు ఆశీర్వచనాలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి మాట్లాడుతూ పంచారామ క్షేత్ర దర్శనానికి అనేక జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక కార్తీకమాసంలో సోమవారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని, ఆ రోజున దేవాలయానికి భక్తుల రాక అధికంగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది భద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

ads