రోల్ మోడల్‌గా రాజమహేంద్రవరం అభివృద్ధి:ఎంపీ భరత్ రామ్

రాజమహేంద్రవరం:16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): నగరంలో 48, 49 డివిజన్లలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ మంగళవారం పర్యటించారు. బర్రే కొండబాబు, అజ్జరపు వాసు ఆధ్వర్యంలో డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్లలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారికి అందించాలని ఆదేశించారు. స్థానిక ప్రజలు డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా డివిజన్లో కమ్యూనిటీ హాలు నిర్మించాలని, డివిజన్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని, త్రాగు నీటి సరఫరాను మెరుగుపరచాలని వారు కోరారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరాన్ని గ్రేటర్ రాజమహేంద్రవరంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రూ.200 కోట్లతో ప్రతిపాదనలు రూపకల్పన చేసినట్లు తెలిపారు. స్మార్ట్ సిటీలకు రోల్ మోడల్‌గా రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తూనే వారంలో రెండు నుంచి మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం నగరంపై ప్రత్యేక దృష్టి సారించి డివిజన్ల వారీగా పర్యటిస్తానని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొంది రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జాంపేట బ్యాంకు ఛైర్మన్ బొమ్మన రాజ్ కుమార్, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, పార్టీ నాయకులు తాడేపల్లి విజయ్ కుమార్ గారా చంటిబాబు, మజ్జి అప్పారావు, కొంచా సత్య, బొచ్చా వెంకటరమణ, దారా శేషు, కుంచే శేఖర్, ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ads