పాదగయలో వైభవంగా కల్యాణోత్సవం

UPDATED 11th FEBRUARY 2018 SUNDAY 10:30 PM

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని ప్రముఖ శైవక్షేత్రమైన పాదగయలో కొలువుతీరిన శ్రీ  రాజ రాజేశ్వరీ సమేత కుక్కుటేశ్వరస్వామి వారి కల్యాణం భక్తుల శివనామ స్మరణతో అంగరంగ వైభవంగా ఆదివారం నిర్వహించారు. మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లను వధూవరులని చేసి పట్టువస్త్రాలు, నగలతో అలంకరించారు. గ్రామోత్సవం అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన కల్యాణవేదికపై వేదపండితులు చెరుకుపల్లి విశ్వనాధశర్మ, ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ మంత్రోచ్ఛరణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎస్. వర్మ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌ కొండేపూడి ప్రకాష్‌, ట్రస్టుబోర్డు సభ్యులు, ఈవో చందక దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads