4,83,234 మందికి చుక్కల మందు

UPDATED 10th MARCH 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 4,83,234 మంది ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తున్నామని జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాలో మొదటిసారిగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పోలియో చుక్కల మందు కలెక్టర్ చిన్నారులకు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయమిశ్రా విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 0-5 సంవత్సరాల లోపు 4,63,234 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందని, ఈ పోలియో చుక్కల కార్యక్రమం మూడురోజుల పాటు జరుగుతుందని తెలిపారు. మొదటిరోజు 90 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేయాలని సంకల్పించామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎస్ఎమ్ లు చిన్నారుల ఇంటికి వెళ్లి చుక్కల మందు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో, మెడికల్ ఆఫీసర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి 387 మంది సూపర్వైజర్లు, 140 మొబైల్స్,3866 పోలియో కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాకు 6 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పోలియో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఫ్లయిస్ ఏరియా, డెల్టా పరిసరాల్లో కూడా ప్రత్యేకమైన కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ వో టి. రమేష్ కిషోర్, జిల్లా వ్యాధి నిరోధక నియంత్రణ అధికారి డాక్టర్ మల్లిక, ఆసుపత్రి వైద్యులు కె. లక్ష్మి, దుర్గారావు, సురేష్, సింధు, ప్రవీణ, మున్సిపల్ కమీషనర్ పి. నాగేంద్రకుమార్, తహసీల్దార్ సిహెచ్ నరసింహారావు, ఎంపీడీవో కె. స్వప్న, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us