ఎన్నికల విధులకు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవు

* జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి

UPDATED 13th MARCH 2020 FRIDAY 7:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి హెచ్చరించారు. పెద్దాపురం సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో  పివోలు, ఏపివోల నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు నియమించిన పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బంది శిక్షణా తరగతులకు తప్పక హాజరు కావాలని అన్నారు. శిక్షణా తరగతులకు చాలా మంది గైర్హాజరైయ్యారని, వారిపై ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు తప్పవని అన్నారు. పోలింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యల్లో భాగంగా వీడియో చిత్రీకరణ, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని అన్నారు. పోలింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని, గతంలో ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వినియోగించడం వల్ల ఈ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు ఉపయోగించడం కొంత ఇబ్బందిగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రెండవ విడత శిక్షణా తరగతులలో బ్యాలెట్ బాక్సులు వినియోగంపై ప్రయోగాత్మకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఎన్నికల నిర్వహణ నియమావళి పుస్తకాన్ని క్షుణ్నంగా చదివి అవగాహన పెంచుకోవాలని, ఈ శిక్షణ తరగతుల వల్ల పోలింగ్ ప్రక్రియలో అనుమానాలు పూర్తిస్థాయిలో నివృత్తి అవుతాయని తెలిపారు. పోలింగ్ అధికారులు నిష్పక్షపాతంగా తమ విధులు నిర్వర్తించి పోలింగ్ ప్రక్రియ విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జి. శేఖర్, పివోలు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads