ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని గుర్తించండి: ఆర్డీవో మల్లిబాబు

పెద్దాపురం,23 మే 2020 (రెడ్ బీ న్యూస్) : మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గుర్తించి తక్షణమే క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు ఎంపీడీవోలను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్లోని ఎంపీడీవో, తహశీల్దార్లు, హౌసింగ్, ఏపీవోలు, ఈవోపీఆర్డీలతో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి ఉంటే వాలంటీర్ల ద్వారా గుర్తించి వారిని తక్షణమే క్వారంటైన్ కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లను అప్రమత్తం చేయాలన్నారు. మండలంలోని తహశీల్దార్లు, ఎంపిడివోలు క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయాల నిర్వహణ, పనితీరుపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లకు ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు జారీ చేసి తద్వారా నిర్వహణ చేపట్టాలన్నారు. డివిజన్లో పేదలందరికీ ఇళ్లు పథకం కింద లబ్ధిదారుల జాబితా పంచాయతీ సెక్రటరీల ద్వారా తనిఖీ చేసిన నివేదిక, అలాగే ఇంకా తనిఖీ చేయవలసిన వివరాలను అదేవిధంగా పేదలందరికీ ఇళ్ళు పథకం కింద చేపట్టిన లేఅవుట్ లలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల ప్రగతిని మండలాల వారీగా ఆర్డీవో సమీక్ష చేశారు. ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడం వలన వడగాల్పులు వీస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేసి వాలంటీర్ల ద్వారా తగుజాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రత్యేక అధికారి శ్రీరామ చంద్రమూర్తి, కార్యాలయం ఏవో చిన్నారావు, డివిజన్ లోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, హౌసింగ్ అధికారులు, ఈవోపీఆర్డీలు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us