గ్రామదర్శిని కార్యక్రమంలో రికార్డులు తేవాల్సిన భాద్యత లేదా...

* వ్యవసాయ అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్ ఫైర్
* ఉపాధిహామీ ఏపీవో పనితీరుపై ఆగ్రహం
* సస్పెండ్ చేస్తానని హెచ్చరిక

UPDATED 4th OCTOBER 2018 THURSDAY 6:00 PM

పిఠాపురం: గ్రామంలో చేస్తున్న అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో చేయాలని జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా అధికారులను ఆదేశించారు. పిఠాపురం మండలం నరసింగపురం గ్రామపంచాయతీ వద్ద స్థానిక ఎంఎల్ఏ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మతో కలిసి గ్రామదర్శిని కార్యక్రమంలో గురువారం కలెక్టరు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పింఛన్లు, రేషన్ పంపిణీ, వ్యవసాయశాఖ ద్వారా ఉచితంగా అందిస్తున్న ఎరువులు, సిసిరోడ్లు, అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలో విద్యా బోధనలు, మధ్యాహ్న భోజన పథకం, గర్భిణీ స్త్రీల పోషక ఆహారం, భూమికి సంబంధించిన సమస్యలు, త్రాగునీరు, ఉపాధిహామీ పనులు, తదితర ప్రభుత్వ పథకాల అమలు చేస్తున్న విధానాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల పనితీరును సంబంధిత అధికారుల సమక్షంలో ప్రజల నుంచి  అధికారుల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. జింక్, జిప్సమ్, బోరాన్ రైతులకు అందచేయడంలో వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతాంగం కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారుల తీరుపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తంచేస్తూ సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. గ్రామంలో ఉన్న రైతాంగం లిస్టును తయారుచేసి రెండు గంటలులోగా అందచేయాలని స్పెషల్ ఆఫీసరు వ్యవసాయశాఖ ఎడి పద్మశ్రీని ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించి ప్రతీ రైతు మీ- సేవ కేంద్రం ద్వారా భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయించుకోవాలని తెలిపారు. గ్రామంలో మీ- సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయమని తహసీల్దార్ సుగుణను ఆదేశించారు. గ్రామంలో చేపట్టే పనుల రిపోర్టును ఉపాధిహామీ ఏపివో పి.వి. కుమారస్వామిని కలెక్టరు అడగగా వాటిని తేలేదని సమాధానం చెప్పడంతో గ్రామదర్శిని కార్యక్రమం జరుగుతున్నప్పుడు రికార్డులు తేవాల్సిన బాధ్యత తెలియదా అని కలెక్టరు ఏపివోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రేషన్ పంపిణీ, అంగన్వాడీ నిర్వహణ, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఫీల్డ్ అసిస్టెంట్, పాఠశాల నిర్వహణ బాగుందని ప్రజలు తెలుపడంతో సంబంధిత శాఖను కలెక్టరు అభినందించారు. అనంతరం ఇళ్ళస్థలాలు, శ్మశానవాటిక స్థలం, తదితర సమస్యలపై ఎంఎల్ఏ కలెక్టరు దృష్టికి తెచ్చారు. శాసనసభ్యులు వర్మ మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కృషి అభినందనీయం అన్నారు. గ్రామదర్శిని ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ గ్రామంలో రూ. కోటి రూపాయలతో సిసి రోడ్లు నిర్మించామని అన్నారు. పాడిగేదెలకు సంబంధించిన సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తానని తెలిపారు. హౌసింగుకు సంబంధించిన పెండింగు సొమ్మును త్వరలోనే అందచేస్తామన్నారు. అనంతరం గర్బిణీ స్త్రీలకు జిల్లా కలెక్టరు, శాసనసభ్యులు పౌష్టికాహార కిట్స్  చిన్నారులకు బాలామృతం ప్యాకెట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి బి. అప్పారావు, ఎంపిపి విజయలత, ఆత్మా చైర్మన్ రాజారావు, నోడల్ అధికారి శివన్నారాయణ రెడ్డి, ఎంపిడిఓ సుబ్బారావు, ఎంఇఓ ఆర్. వరప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 
 

ads