రాష్ట్ర స్ధాయి కోవిడ్ ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

UPDATED 10th AUGUST 2020 MONDAY 7:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర స్ధాయి కోవిడ్ ఆసుపత్రిగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని మార్చినందున రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉచిత బస్సుల ద్వారా వివిధ రిఫరల్ ఆసుపత్రులకు తరలించడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఓపీ నిమిత్తం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి వచ్చే రోగులను రిఫరల్ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను మంత్రి వేణు గోపాలకృష్ణ, కాకినాడ ఎంపీ వంగాగీత, జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీజీహెచ్ ను రాష్ట్ర స్ధాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చినందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే రోగులను రెడ్ క్రాస్ సంస్ధ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో ఉచితంగా ఆయా రిఫరల్ ఆసుపత్రులకు తరలిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు భయానికి గురవుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయంతో సుమారు 1000 పడకలను సిధ్ధం చేయడంలో భాగంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ముఖ్యంగా పిల్లలు, ప్రసూతి, కేన్సర్ వార్డులకు సంబంధించిన సేవలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని తెలిపారు. జీజీహెచ్ కు వచ్చే రోగులు ఆందోళనకు గురువకుండా ఆరోగ్యశ్రీ సేవలందించే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 2 లక్షల 83 వేలు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 31,480 పాజిటివ్ కేసులు కాగా, అందులో సుమారుగా 14 వేలు యాక్టివ్ కేసులు ఉన్నాయని, సుమారు 17 వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని, హోం ఐసొలేషన్ లో 10,850 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం వైద్య సేవలు అందించే రిఫరల్ ఆసుపత్రుల వివరాల కరపత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలక్టర్లు కీర్తి చేకూరి, జి. రాజకుమారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యం. రాఘవేంద్రరావు, ఆర్ఎంఓ డాక్టర్ గిరిధర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ వై.డి. రామారావు, అర్బన్ తహసీల్దార్ వై.హెచ్.ఎస్. సతీష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

ads