స్పందన ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

* జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

UPDATED 9th DECEMBER 2019 MONDAY 6:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. స్థానిక కలక్టరేట్ వివేకానంద హాలులో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 860 మంది అర్జీదారుల నుంచి జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్-2 జి. రాజకుమారి, జిల్లా పరిషత్ సిఈవో ఎం. జ్యోతి, బిసి కార్పోరేషన్ ఇడి ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మిలు అర్జీలు స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం అందచేశారు. ఈ స్పందన కార్యక్రమంలో రెవెన్యూ- 650, సివిల్ సప్లయి-16, హౌసింగ్-5, ప్రజాసాధికార సర్వే-125, ఆధార్-35, రూరల్ పింఛన్లు-25, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్-80 అర్జీలతో పాటు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, కుటుంబ, భూమి తగాదాలు, ఉద్యోగ, ఉపాధి, రుణాలు కల్పించాలని అర్జీలు వచ్చాయన్నారు.
తాళ్లరేవు మండలం జి. వేమవరం గ్రామానికి చెందిన వాసంశెట్టి అనంతలక్ష్మి సర్వే నెం 54/7 భూమిలో ఉన్న తన గృహనికి విద్యుత్ నిమిత్తం సొంత ఖర్చులతో స్థంభం వేయించగా, ప్రస్తుతం తన గృహానికి అడ్డంగా వేరే వాళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని ఈ విషయంపై తాళ్లరేవు జెఇకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదు చేయగా సమస్యను వెంటనే పరిష్కరించాలని ట్రాన్స్ కో ఎస్ఇని జేసీ ఆదేశించారు.
గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ నిమిత్తం 2019 అక్టోబరు నెలలో కాకినాడ నగరపాలక శాఖ సిబ్బంది అద్దెకి తీసుకోగా రెండు నెలలు గడుస్తున్నా అద్దె అగ్రిమెంట్ ఇవ్వలేదని స్థానిక భాస్కరనగర్ కు చెందిన కె. వీరాస్వామి ఫిర్యాదు చేయగా కాకినాడ మున్సిపల్ కమీషనర్‌ను సమస్య పరిష్కరించాలని జెసి ఆదేశించారు.
పి. గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామానికి చెందిన కాసర నాగేశ్వరరావు తమ గ్రామంలో ఉపాధి హామీ పథక ఫీల్డ్ అసిస్టెంట్ 12వ విడత జరిగిన సామాజిక తనిఖీలో అక్రమాలు బయటపడినా ఎలాంటి  చర్యలు తీసుకోకపోగా తిరిగి అదే వ్యక్తినే కొనసాగిస్తున్నారని ఫిర్యాదు చేయగా డ్వామా పిడిని విచారణ చేయాలని జేసీ ఆదేశించారు. 
ఎటపాక మండలం కాపవరం గ్రామానికి చెందిన గంజి వెంకట నరసయ్య తన భూమి ఆన్ లైన్ చేయని కారణంగా రైతు భరోసా రాలేదని ఫిర్యాదు చేయగా ఎటపాక ఆర్డీవోను సమస్య పరిష్కరించాలని జెసి ఆదేశించారు.
ఎటపాక మండలం బోజగుప్ప గ్రామానికి చెందిన వి. సమక్క సచివాలయం ఎఎన్ఎమ్ పరీక్షలో 45 మార్కులు వచ్చినా ఎస్.టి వారికి ఉద్యోగం ఇచ్చారని, 55.75 మార్కులు వచ్చిన తనకు ఉద్యోగం రాలేదని ఫిర్యాదు చేయగా ఆర్జీని పరిశీలించి సమస్య పరిష్కరించాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని జేసీ ఆదేశించారు. 
అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన పులగం.సూర్యనారాయణరెడ్డి తమ గ్రామంలో శ్మశానస్థలం సర్వే నెం. 18/8లో 0.085 సెంట్లు భూమిలో కొంతమేర నల్లమిల్లి తాతారెడ్డి ఆక్రమించి ప్రహారీగోడ నిర్మించారని దీంతో ప్రజలకు ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చేయగా అనపర్తి తహసీల్దారును విచారణ జరిపి సమస్య  పరిష్కరించాలని ఆదేశించారు.
దేవీపట్నం మండలం పి. గొందూరు గ్రామస్థులు తమ భూములు పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నా పరిహారం చెల్లించలేదని ఫిర్యాదు చేయగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us