నూతన పద్దతిలో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం

* స్పందన కార్యక్రమానికి విశేష స్పందన 
* కలక్టరేట్ వద్ద బారులు తీరిన ప్రజలు
* ప్రభుత్వ పథకాలపై అవగాహనకు కళాజాతాలు

UPDATED 1st JULY 2019 MONDAY 7:00 PM

కాకినాడ: నూతన పద్దతిలో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి అన్నారు. స్థానిక కలక్టరేట్ వివేకానంద హాలులో స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 653 మంది ఫిర్యాదుదారులు హాజరై తమ ఫిర్యాదులను జిల్లా కలక్టర్ మురళీధరరెడ్డి, జాయింట్ కలక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్-2 సిహెచ్ సత్తిబాబు, డిఆర్వో యం.వి. గోవిందరాజులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మురళీధరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రస్ధాయిలో ఆర్.టి.జి.లో ఫిర్యాదుల పరిష్కారానికి స్పందన వెబ్ సైట్ ను ప్రారంభించిందని, ప్రతీ అర్జీని ఆన్ లైనులో నమోదుచేసి రశీదు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే దానికి గల కారణాలు కూడా వివరించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం ద్వారా ఫిర్యాదుల పరిష్కారాన్ని పరిశీలించడం జరుగుతుందని, జిల్లా అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించినప్పుడు అర్జీదారులు రశీదు తీసుకువచ్చి వారి ఫిర్యాదు పరిష్కార వివరాలు తెలుసుకుంటారని అన్నారు. కోర్టు కేసులు, వంతెనలు, రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, భూ ఆక్రమణలు, చేపల చెరువులు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులు ఆయా శాఖల అధికారులు పర్యటించి ప్రతిపాదనలు సిధ్ధం చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృధ్ధి కార్యక్రమాలపై అవగాహనకు కళాజాతాలు ఏర్పాటు చేసి, బాల్య వివాహాలు, మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, బెల్ట్ షాపుల తొలగింపు, కాలానుగుణంగా ప్రబలే వ్యాధుల నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజల భాగస్వామ్యంతో స్పందన కార్యక్రమం నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి జాయింట్ కలక్టర్ పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

ads