ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

UPDATED 2nd MAY 2019 THURSDAY 7:00 PM

పెద్దాపురం: రైతులు పండించిన ధాన్యానికి మద్దత్తు ధర కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎడిఎ ఎం. రత్నప్రశాంతి అన్నారు. పెద్దాపురం మండల పరిధిలోని కట్టమూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ద్వారా ఇటు రైతుకు లాభంతోపాటు సొసైటీ ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుందని, రైతులు ధాన్యం పండించిన తరువాత కొనుగోలు కేంద్రానికి సమాచారం అందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కళ్ళం వద్దకు వచ్చి ధాన్యం తేమ నిర్ధారణ చేసి కళ్లాల నుంచి నేరుగా రైతులకు ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం కార్యాలయం రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో కొల్లి ద్వారకాదేవి, ఏఈవో ప్రసాద్, ఎంపీఈవోలు ఉదయకుమార్, షేక్ బాలాజీ, పిఏసీఎస్ సీఈవో పి.ఎస్.వి.ఎన్. ఆచార్యులు, సిబ్బంది పిట్టు రంగారావు, ఎస్. నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.         

ads