ఘనంగా కార్మిక దినోత్సవం

UPDATED 1st MAY 2019 WEDNESDAY 8:00 PM

సామర్లకోట: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఎఐటియుసి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎఐటియుసి ఆధ్వర్యంలో పట్టణ తాపీ పనివారల సంఘం అధ్యక్షుడు దూరంపూడి రాజు, నక్కా సత్తిబాబు, జై భీమ్ భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు చెంగల అబ్బు, డి. దుర్గబాబు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు బచ్చా శ్రీను, చిన్నా శ్రీను, మిరియాల రాజు, రిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడు కాతేటి అప్పారావు, రాజు, రాజారావు, ఐటిసి సీనియర్ నాయకులు ఉప్పలపాటి సామ్సన్ ఆధ్వర్యంలో ఎఐటియుసి పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎఐటియుసి రాష్ట్ర సమితి సభ్యుడు ఉప్పలపాటి చంద్రదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు పార్కు వద్ద జై భీమ్ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఎండీవో కార్యాలయం వద్ద పట్టణ తాపీ పనివారల సంఘం, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మిక సంఘం, అగస్టా పాఠశాల వద్ద రిక్షా కార్మిక సంఘం, తదితర ప్రాంతాలలో ఎఐటియుసిపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎఐటియుసి రాష్ట్ర సమితి సభ్యుడు ఉప్పలపాటి చంద్రదాసు మాట్లాడుతూ నిత్యం స్వేదాన్ని చిందించే కార్మిక లోకం తమ హక్కుల పరిరక్షణకు అమరవీరుల త్యాగాలే స్ఫూర్తిగా పోరాడాలని, కార్మికుల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కార్మికులు లేకుంటే అభివృద్ధి లేదని, మే డే స్ఫూర్తితో కార్మిక లోకం ఏకం కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.

ads