ఆసుపత్రి వ్యర్థాల శుద్ధి పరిశ్రమ వద్దంటూ రైతులు ఆందోళన

UPDATED 4th MARCH 2019 MONDAY 8:00 PM

పెద్దాపురం: పెద్దాపురం డివిజన్ పరిధిలోని రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఆనుపత్రి వ్యర్థాల శుద్ధి చేసే గోదావరి బయో మేనేజ్ మెంట్ పరిశ్రమను నిర్మించడానికి వీల్లేదంటూ సుమారు ఏడు గ్రామాలకు చెందిన రైతు నాయకులు మండల పరిధిలోని రాయభూపాలపట్నం గ్రామంలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రైతులు మాట్లాడుతూ ఈ పరిశ్రమ నిర్మాణం చేపడితే పరిసర ప్రాంతాలు దుర్గంధపూరితం కావడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. అలాగే వందలాది ఎకరాల్లో ఉన్న పంటలు సైతం పండే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పరిశ్రమ యాజమాన్యం ప్రజల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి ఫ్యాక్టరీ నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ పరిశ్రమ నిర్మాణానికి మర్రిపూడి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సంబంధిత పరిశ్రమ యాజమాన్యం దౌర్జన్యంగా నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని, ఆ సమయంలో పరిసర గ్రామాలకు చెందిన రైతులు తమ అభిప్రాయాలను తెలియచేయడం జరిగిందని, ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడానికి వీలులేదని తామంతా జాయింట్ కలెక్టరుకు తెలియచేశామని చెప్పారు. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ఇటువంటి ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించఢంపై వారు తీవ్రంగా వ్యతిరేకించారు.అనంతరం పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కారణంగా మర్రిపూడి, చినబ్రహ్మదేవం, రాయభూపాలపట్నం, కొండపల్లి, మేడపాడు, జి.కొత్తూరు, సింగంపల్లి గ్రామాలకు చెందిన పంట పొలాలు నిర్జీవంగా మారిపోతాయన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే తామంతా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుట్టా వీరభద్రరావు, గల్లా శ్రీనివాస్, పుట్లా సుబ్బారావు, నూకతట్టు ధర్మరాజు, గోలి నుధాకర్, కోట్ల అమ్మన్న చౌదరి, రిమ్మలపూడి వెంకట్రావు, మేడిది దొరబాబు, పుట్టా రామకృష్ణ, కంచుమర్తి కాటంరాజు, ముత్యాల సోమరాజు, మోదుకూరి బంగార్రాజు, పీత నూకయ్య, గొల్లపల్లి నాగేశ్వరరావు, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

ads