ఏప్రిల్ 2022 నాటికి పోలవరం పూర్తి చేయాలి

* జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

UPDATED 29th JUNE 2020 MONDAY 8:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): పోలవరం ప్రాజెక్టును 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని, అలాగే నిర్దేశిత గడువులోగా పునరావాస కాలనీలను కూడా పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గోకవరం, దేవీపట్నం మండలాల్లో ఆయన సోమవారం ఉదయం పర్యటించారు. సాయంత్రం రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయంలో పునరావాస కాలనీల ప్రగతిపై సమీక్షించారు. పునరావాస కాలనీల నిర్మాణాలను ఎప్పటికి పూర్తి చేస్తారన్న అంశంపై శాఖల వారీగా కార్యనిర్వాహక ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసిత కుటుంబాలను ముంపుబారి నుంచి తరలించడం ప్రాధాన్యతాంశంగా ప్రభుత్వం పరిగణిస్తోందని, అందుకు తగినట్లుగా కాలనీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గిరిజన నిర్వాసితులకు ఇవ్వాల్సిన భూమికి భూమి, పునరావాస కాలనీల్లో పూర్తి మౌలిక వసతుల కల్పన చర్యలను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో పునరావాస కమీషనర్  టి. బాబూరావు నాయుడు, పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి ఆనంద్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు ప్రవీణ్ ఆదిత్య, ఎ. వెంకటరమణ, ఏఎస్పీ బిందుమాధవ్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జీవీ ప్రసాద్, స్పెషల్ కలెక్టరు మురళి, రంపచోడవరం ఎమ్మెల్యే ఎన్. ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

ads