జీవన ప్రమాణాలు పెంచడానికి చిన్న పరిశ్రమల స్థాపన అవసరం

UPDATED 31st JANUARY 2019 THURSDAY 9:00 PM

పెద్దాపురం: ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. స్థానిక తాపీ వర్కర్ల కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ బివి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సాహం, అభివృద్ధిపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు పాల్గొని మాట్లాడుతూ ప్రతీ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. స్థానికంగా లభ్యమయ్యే ముడిసరుకును దృష్టిలో ఉంచుకుని మంచి వ్యాపారం ఎంపిక చేసుకొని ఆయా రంగాలలో నైపుణ్యం పెంపొందించుకోవాలని చెప్పారు. మహిళలు ఏ రంగంలో అయినా రాణిస్తారని, పెద్దాపురం పట్టణంలో సుమారు ఎనిమిది వేలు మహిళా శక్తి సంఘాలు ఉన్నాయని తెలిపారు. ప్రతీ మహిళా తాను ఆర్థికంగా బాగుపడుతూ పదిమందికి ఉపాధి కల్పించాలని సూచించారు. నాబార్డ్ ఏజీఎం కె.విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పరిశ్రమ స్థాపన అనేది నమ్మకం, ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుందని, ఈ రెండింటితో పరిశ్రమలను విజయవంతంగా నిర్వహించవచ్చని అన్నారు.  పరిశ్రమల శాఖ అధికారి బి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు సరైన వనరులు గుర్తించి మంచి లాభదాయకమైన పరిశ్రమలు ఎంపిక చేసుకోవాలని, దీనికి అనుగుణంగా మంచి స్థలం గుర్తించి పరిశ్రమలు స్థాపిస్తే వడ్డీ రాయితీ ఉంటుందని అన్నారు. ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ మణికుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా యువత, మహిళలకు ఉచితంగా వివిధ సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల మహిళలు శిక్షణ పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఏడిబి) చీఫ్ మేనేజర్ కృష్ణన్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (మెయిన్) బ్రాంచ్ మేనేజర్ వి.ఎస్.కె. సాగర్, మహిళా సంఘాలు, తాపీ, వడ్రంగి మేస్త్రీలు, తదితరులు పాల్గొన్నారు

ads