యువత క్రమశిక్షణను అలవర్చుకోవాలి

UPDATED 25th SEPTEMBER 2018 TUESDAY 5:30 PM

సామర్లకోట: యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణ అలవర్చుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సెట్రాజ్ సిఇవో ఎస్. మల్లిబాబు అధ్యక్షతన స్థానిక టిటిడిసిలో సెట్రాజ్-జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులు పాటు జరిగే యువజన సమైక్యతా శిబిరాన్ని మంగళవారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి వచ్చిన యువతను ఉద్దేశించి మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ యువత నేటి సమాజంలో చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని దుర్భరపర్చుకుంటున్నారని, ఈ పరిస్థితి నుంచి యువత బయట పడాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలని, 25 సంవత్సరాల లోపు ఉన్న ప్రతీ యువత ఈ వయస్సులో చెడుప్రబావాలకు లోనవుతుంటారని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం యువతకు బాసటగా విద్యాపరంగా అవ సరమైన సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థి దశ నుంచి విద్యతో పాటు క్రీడలు, డిబేట్, తదితర అంశాలలో ప్రావీణ్యాన్ని సంపాదించాలని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టిందని ఇందులో భాగంగా గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గతంలో పోలీసు రిక్రూట్ మెంటులో 6000 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందని, మహిళలకు పోలీసు శాఖలో 30 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఐటీ రంగం, రాయలసీమ, తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలు నిర్వహించి మెరిట్ ప్రకారం ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎస్సీ, బిసి, కాపు, తదితర కులస్తులకు ఐపిఎస్, ఐఏఎస్ పరీక్షలకు ప్రభుత్వ పరంగా కోచింగ్ ఇప్పిస్తున్నామని, స్కిల్ డెవలప్ మెంట్ పెంచడానికి శిక్షణలు ఇస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతి నెలకు రూ.1000 వంతున ఇవ్వడానికి వెబ్ సైట్ ప్రారంభించడం జరిగిందని, దీని ద్వారా 10 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ యువత భవిష్యత్ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి లక్ష్యసాధనకు కృషి చేయాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు జీవన విధానం, సంస్కృతి అవసరాలు గురించి యువత పర్యటించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని, తద్వారా ఆయా ప్రాంతాలపై అవగాహన ఉంటుందని అన్నారు. యువత ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని జ్ఞాన సంపాదనకు ప్రాధాన్యత ఇచ్చి జ్ఞాన అంశాలు తెలుసుకునే ప్రయత్నాలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు  దేశ సమైక్యత, సమగ్రతలకు పాటుపడాలని అన్నారు. యువత సరైన సమయంలో కష్టపడితే అనుకున్న ఫలితం సాధించవచ్చని, ఇతరులతో పోల్చుకుని సమయం వృధా చేయకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన అనే భగవత్ గీతలోని శ్లోకాన్ని చదివి యువతను ఉత్తేజపర్చారు. ఈ శిబిరం ద్వారా మీరు విషయాలు తెలుసుకుని వాటిని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని  ఆయన తెలిపారు. సెట్రాజ్ సిఇవో మల్లిబాబు మాట్లాడుతూ ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ఇంటిగ్రేషన్ క్యాంపు జరుగుతుందని చెప్పారు. ప్రతీ జిల్లా నుంచి 25 మంది యువతీ, యువకులు ఈ శిబిరాలకు హాజరయ్యారని, రాష్ట్రం నుంచి 280 మంది ఈ శిబిరానికి రావడం జరిగిందని చెప్పారు. ఈ శిబిరంలో ప్రాంతాల సంస్కృతి, జీవన విధానాలు, మానసిక వత్తిడి, లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యం, యువతపాత్ర, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తదితర అంశాలపై అనుభవజ్ఞులైన నిపుణులు, అధికారులచే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను, కలెక్టరు కార్తికేయ మిశ్రాను సెట్రాజ్ సిఇవో పుష్పగుచ్చాలతో సన్మానించి మెమోంటో అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, జిల్లా సమాచారశాఖ ఉప సంచాలకులు ఎం. ఫ్రాన్సిస్, సెట్రాజ్ అధికారులు, సిబ్బంది, వివిధ జిల్లా నుంచి వచ్చిన యువతీ, యువకులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads