పేదలకు దుప్పట్లు పంపిణీ

UPDATED 28th DECEMBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యజనని శ్రీ శారదామాత 166వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం విశేష పూజలు, ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రముఖ గణితావధాని, జాతీయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ శారదామాత జీవిత విశేషాలను వివరించారు. శ్రీ రామకృష్ణ పరమహంస సహధర్మచారిణిగా మాతృశ్రీ రామకృష్ణుల శిష్యులను కన్నబిడ్డల వలె చూస్తూ వారికి దిశానిర్దేశం చేశారని అన్నారు. ఆమె మనందరికీ ఇచ్చిన సందేశం ఇతరులలో లోపాలను చూడక మనలోని లోపాలను సరిదిద్దుకోవాలని, ఇదే విధంగా మనలోని అవలక్షణాలను తొలగించుకోవడానికి  ప్రయత్నించాలని ఆయన అన్నారు. సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ మాట్లాడుతూ తమ సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గ్రామస్థులు, అలాగే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ బృందం సహకారం మరువలేనిదని అన్నారు. సమితి 60వ వార్షికోత్సవం సందర్భంగా అందరి సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించ తలపెట్టామని అన్నారు. సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాధ్ మాట్లాడుతూ సమితి నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు, అవగాహనా ర్యాలీలు, దుప్పట్ల పంపిణీ వంటి కార్యక్రమాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారం అభినందనీయమని వారికి సమితి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం ఎంపిక చేసిన అర్హులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో త్రివర్ణా స్కూల్ కరస్పాండెంట్ తోటకూర వెంకటేశ్వరరావు, సమితి సభ్యులు ఎన్. బాబ్జి, సూర్యచంద్రరావు, టి. సాంబశివరావు, మల్లిపూడి గంగాధరరావు, పెంటకోట గంగాధరరావు, టి.వి. రమణ, టి. నరసింహారావు, శ్రీ శారదా బాలానందం కన్వీనర్ చెవ్వాకుల సత్యనారాయణ, సమితి మహిళా సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు కుంకుమార్చన, ఆరాత్రికం, సంకీర్తనలు, ప్రసాద వితరణతో కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా ముగిసాయి.

 

ads