జగనన్నవసతి దీవెన- విద్యా దీవెనతో విద్యార్థులకు భరోసా

* కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్

UPDATED 24th FEBRUARY 2020 MONDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : జగనన్నవసతి దీవెన- విద్యా దీవెన ద్వారా జిల్లాలో లక్షా 20 వేల మంది విద్యార్థులకు ఆర్థిక సహకారం అందుతుందని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్ తెలిపారు. స్థానిక
సిబిఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జగనన్న వసతి దీవెన-విద్యా దీవెన కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్, సామర్లకోట పిఏసీఎస్ అధ్యక్షులు దవులూరి దొరబాబుతో కలిసి సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సామర్లకోట ఇంఛార్జ్ ఎంపిడిఓ అబ్బిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ గీతా విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రెండున్నర కోట్ల మంది  ప్రజలను కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే జగనన్న వసతి దీవెన-విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టి జిల్లాలో సుమారు లక్షా20 వేల మందికి ఈ పథకాన్ని చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతీ తల్లిదండ్రులకు వారి పిల్లల చదువు ఆర్థికంగా భారం కాకూడదని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ.15 వేలు, అలాగే జగనన్న వసతి దీవెన క్రింద ఐటిఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ కు రూ. 15వేలు, డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రూ. 20 వేలు రెండు విడతలుగా వారి తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ఓట్ల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కావని పార్టీలకతీతంగా పేద ప్రజల సమస్యలు తీర్చే పథకాలని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి అవసరమైన పథకాలు అమలు చేయడం ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. ఉగాది నాటికి పేదలందరికి ఇళ్ల పట్టాలను అందించే బృహత్తర కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ప్రభుత్వం కోసం కాదని పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వ్యవస్థ అని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందేవిధంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకు సత్ప్రవర్తన నేర్పాలని, సోషల్ మీడియాకు దూరంగా వుండేలా జాగ్రత్త వహించి వారికి మంచి భవిష్యత్తును అందించాలని ఆమె కోరారు.  సామర్లకోట పిఏసీఎస్ అధ్యక్షులు దవులూరి దొరబాబు మాట్లాడుతూ విద్యావ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, చాలా మందికి ఆర్థిక స్తోమత లేక తమ పిల్లలను ఇంటర్మీడియట్ వరకూ చదివించి చదువు మాన్పించేస్తున్నారని, అలాంటి వారికి ఆర్థిక సహాయం అందించి వారి పిల్లల భవితకు బంగారు బాటలు వేయాలనే తపనతో ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, నాడు- నేడు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు వందేమాతరం జాతీయ గీతం అలపించి మహాత్మా గాంధీ, అంబేద్కర్, పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గాయత్రి, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ కమీషనర్లు జి. శేఖర్, ఏసుబాబు, సామర్లకోట తహశీల్దార్ జితేంద్ర, ఎంఇఓ విజయలక్ష్మి, డిఎల్పీవో నరసింహరావు, సామర్లకోట, పెద్దాపురం ఈవోపీఆర్డీలు సూర్యనారాయణ, హిమమహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు​ 
  

ads