గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

UPDATED 31st AUGUST 2018 FRIDAY 5:00 PM

పెద్దాపురం: గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మండలంలోని చదలాడ, దివిలి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి  శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. దివిలి మెయిన్ రోడ్డులో గల దుకాణాలు రోడ్డు విస్తరణలో పోవడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా హైస్కూలు ప్రాంగణంలో జెడ్.పి. కాంప్లెక్స్ ఏర్పాటు ద్వారా 20 షాపులు నిర్మాణానికి, అలాగే రూ. ఐదు లక్షల ఎమ్మెల్యే గ్రాంటుతో నిర్మిస్తున్న శ్రీసాయి వర్తక సంఘం కమ్యూనిటీ భవనానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు చదలాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీవర సిద్ది వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లోను ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపట్టి డిసెంబరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అందరూ దైవభక్తి కలిగి ఉండాలని, భక్తితోనే మనిషి సన్మార్గుడుగా మారి జీవితంలో మహామనిషిగా జీవిస్తాడని తెలిపారు. గ్రామాల్లో అన్నిచోట్ల సిసి రోడ్లు, డ్రైనేజీలు,  కమ్యూనిటీ భవనాలను నిర్మించడం జరుగుతున్నట్లు తెలిపారు. దివిలిలో రూ. కోటితో కాపు కళ్యాణ మండపం మంజూరు అయిందని, దీనికి ఒక ఎకరం స్థలం అవసరముంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో పి. వసంతమాధవి, ప్రత్యేక అధికారి మల్లిఖార్జునరావు, పంచాయతీరాజ్ జెఇ రామకృష్ణయ్య, మాజీ సర్పంచులు కొత్తెం  కోటి, వెంకటేశ్వరరావు, రాగాల మాణిక్యాంబ, పులిమేరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల వీరాస్వామి నాయుడు, మెయిళ్ల కృష్ణమూర్తి, కమ్మిల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
ads