అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి

UPDATED 19th SEPTEMBER 2018 WEDNESDAY 5:30 PM
పెద్దాపురం: అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు అందరనీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ పట్టణాలు, అన్ని గ్రామాల్లో ఉన్న బి.ఎల్.వోలు, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయం, ఆన్ లైన్ ద్వారా గాని ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు. రాజకీయ పార్టీలకు అందచేసిన ఓటర్ల జాబితాను సరిచూసుకుని, మార్పులు, చేర్పులు అవసరమైతే తగు సలహాలు, సూచనలు, అభ్యంతరాలు లిఖితపూర్వకంగా తగు ఆధారాలతో రెవెన్యూ డివిజనల్ అధికారి, పెద్దాపురం, సామర్లకోట తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లకు కాని అందచేయాలని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట తహసీల్దార్లు జి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. శివకుమార్, సామర్లకోట మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, హోంమంత్రి పిఎ నిమ్మకాయల సుబ్బారావు, పెద్దాపురం, సామర్లకోట టిపివోలు భాస్కరరావు, రత్నకుమారి, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ జి. కృష్ణ, టిడిపి పట్టణ అధ్యక్షుడు రంధి సత్యనారాయణ,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పట్టణ అధ్యక్షుడు కె. కామేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, బిజెపి నాయకుడు పి. శ్యామ్ బాబు, బి.ఎస్.పి నాయకుడు పెనుమాక ఎజ్రా, తదితరులు పాల్గొన్నారు.

 

ads