దటీజ్ ప్రశాంత్ కిషోర్

UPDATED 23rd MAY 2019 THURSDAY 5:00 PM

రెడ్ బీ న్యూస్: ప్రశాంత్ కిషోర్ ...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం. 2014 ఎన్నిక‌ల‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయన పేరు ఆ తరువాత దేశవ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో తరచూ వినిపిస్తూనే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స‌రిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా వైసిపి  అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ పోషించిన పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. గడిచిన మూడు సంవత్సరాలలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ఇచ్చిన సలహాలు ఎంతో ప్రధాన పాత్ర పోషించాయి. ప్రశాంత్ కిషోర్ ను పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిని జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. రెండేళ్ల ముందుగానే 2019 ఎన్నిక‌ల కోసం ప‌క్కా ప్రణాళికలను రూపొందించారు. వాస్తవానికి జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తే బాగుంటుంద‌నే సలహా ఇచ్చింది కూడా ప్రశాంత్ కిశోరే. కేవలం సలహా ఇవ్వడం మాత్రమే కాదు..ఆ పాదయాత్రకు ప్రజల్లో ఆదరణ పెరగడానికి కూడా ఆయన పక్కా వ్యూహాలను అమలు చేశారు. నిరంతరం సోషల్ మీడియాను ఉపయోగించుకుని పార్టీ అధినేతను నిత్యం ప్రజలతో టచ్‌లో ఉండేలా ప్రణాళికలు రచించారు. దాంతో పాటు జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రకటన చేసిన పార్టీ ప్లీనరీ వేదికగానే ఎన్నిక‌ల మేనిఫెస్టో న‌వ‌ర‌త్నాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక‌ నంద్యాల ఎన్నిక‌ల సమ‌యంలోనూ ప్రశాంత్ కిషోర్ వైసిపి కోసం ప‌నిచేశారు. అయితే అక్కడ వైసీపీ ఓడిపోయింది. దీంతో ప్రశాంత్ కిశోర్ సమర్థతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ జగన్ మాత్రం ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచారు. అభ్యర్థుల ఖరారు, వారు అనుసరించాల్సిన వ్యూహాలు, ఇంకా అనేక విషయాల్లో జగన్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారని పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల‌తో పాటు స‌హ‌జంగా ఎప్పుడూ దేవుడిని ఎక్కువ‌గా నమ్మే జ‌గ‌న్ ఈసారి ముహూర్త బ‌లాన్ని న‌మ్మారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గంలోనే విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వరూపానంద స్వామిని విశ్వసించారు. ఆయ‌న చెప్పిన ముహూర్తాలు, స‌మ‌యం ఆధారంగా త‌న నిర్ణయాలను అమలు చేశారు. అప్పటి వ‌ర‌కు ఏ ఆశ్రమాలు, దేవాలయాలకు అంతగా వెళ్లని జగన్ ప్రశాంత్ కిశోర్ సలహాల మేరకే స్వామిజీలను కలవడం, దేవాలయాలను సందర్శించడం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ ఇమేజ్‌ను బాగా ప్రమోట్ చేయడంలోనూ ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం సమయంలో కావాలి జగన్-రావాలి జగన్ స్లోగన్‌తో పాటు చంద్రబాబు టార్గెట్‌గా బైబై బాబు అనే నినాదాలు ప్రజల్లోకి బాగా దూసుకెళ్లాయి. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  ఆయన తన సేవలను అందించి పార్టీ ఘన విజయానికి ఎంతో పాటుపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ కిషోర్...      

 

ads