తప్పుడు దరఖాస్తు చేస్తే కఠిన చర్యలు తప్పవు

UPDATED 7th MARCH 2019 THURSDAY 6:00 PM

పెద్దాపురం: ఓటర్ల జాబితాలో ఓట్లు తొలగించాలని బోగస్‌ దరఖాస్తులు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని  పెద్దాపురం ఆర్డీవో ఎస్.ఎస్.వి.బి. వసంత రాయుడు హెచ్చరించారు. స్థానిక ఆర్డీవో  కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ఓటు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు, బదిలీకి సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో భాగంగా కంప్యూటర్ లో పొందుపరిచిన నివేదికలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ ఆన్ లైన్ ద్వారా ఫారం-7 ఉపయోగించి ఓట్లు రద్దు చేయమని వచ్చిన దరఖాస్తులపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గానికి 12,669 మందికి కొత్తగా జారీ చేసిన ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు ఎలక్షన్ కమీషన్ నుంచి జారీ అయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో రెండు మున్సిపాల్టీలు, రెండు మండలాలకు సంబంధించి కొత్త ఓటరు గుర్తింపు కార్డులు 12,669 జారీ అయ్యాయని, వీటిని సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ఓటరు ఇంటికి వెళ్లి అందచేస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 211 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ప్రత్యేక ర్యాంపులు, ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించామని తెలిపారు. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలు, రీపోలింగ్ నివేదికలు ఆధారంగా రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ సహకారంతో చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం కొనసాగిస్తే ముందుగా పోలీసుశాఖ అనుమతులు పొందాలని అన్నారు. గ్రామాల్లో ఈవీఎం-వివిప్యాట్లపై ఓటర్లకు ప్రతీ రోజు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us