అతిరాత్ర ఉత్క్రుష్ట శ్రౌత సోమ యాగానికి భూమిపూజ

UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 6:00 PM

పెద్దాపురం: అతిరాత్ర ఉత్క్రుష్ట శ్రౌత సోమ యాగాన్ని పెద్దాపురం పట్టణంలో నిర్వహించడం పట్టణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నానని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో  స్థానిక పాండవులమెట్ట సూర్యనారాయణ స్వామి వారి దేవాలయ సమీపంలో అతిరాత్ర ఉత్క్రుష్ట శ్రౌత సోమ యాగానికి శుక్రవారం ఉదయం చైర్మన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా యాగ విషయక సలహాదారులు బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ అధ్యక్షతన జరిగిన సభలో చైర్మన్ పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 14 నుంచి 25వ తేదీ వరకు అతిరాత్ర ఉత్క్రుష్ట శ్రౌత సోమ యాగం, 26న పుత్రకామేష్ఠి, 27న శ్రీ ప్రత్యంగరీ హోమం నిర్వహించడానికి భూమిపూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జిల్లాలో తొలుత ఈ యాగం మురమళ్ళలో జరిగిందని, రెండవది పెద్దాపురం కావడం శుభసూచకం అన్నారు. ఈ యాగానికి పట్టణ ప్రజల సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యాగ విషయక సలహాదారులు హరిహరనాథ శర్మ మాట్లాడుతూ 24 యాగాలు చేయాలనే సంకల్పంతో ప్రారంభించామని, ఇంతవరకు 21 యాగాలు నిర్విఘ్నంగా పూర్తి చేశామని, 22వ అత్రిరాత్ర యాగాన్ని ఇక్కడ నిర్వహించడానికి సంకల్పించామని అన్నారు. రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు హాజరుకావచ్చని అంచనా వేస్తున్నామని, సకల అరిష్టాలు తొలగడానికి, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కారకమైన బృహత్తర మహాయజ్ఞాలలో భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ సందర్భంగా యాగానికి సంబందించిన బుక్ లెట్స్ ను చైర్మన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, పట్టణ టిడిపి అధ్యక్షుడు రంధి సత్యనారాయణ, డాక్టర్ తాళాబత్తుల సాయి, కొత్త వీరన్న, తమ్మన శ్రీనివాసరావు, దాసరి సత్యనారాయణ, స్వామియాగ ట్రస్ట్ సభ్యులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.     

ads