ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలి

UPDATED 22nd MAY 2019 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం: కౌంటింగుకు సంబంధించి ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ వి.కె. దహియా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 23వ తేదీన పెద్దాపురం నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి జెఎన్టీయు (కాకినాడ)లో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియపై జనరల్ అబ్జర్వర్ వి.కె. దహియా, పార్లమెంటరీ అబ్జర్వర్ నందగోపాల్, పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు కౌంటింగ్ సిబ్బందికి బుధవారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీవో వసంత రాయుడు మాట్లాడుతూ కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డుతో పాటు ఇచ్చిన ఆర్డర్ కాపీ తీసుకుని రావాలని అన్నారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, స్టేషనరీ, బ్యాగులు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం జరగదని తెలిపారు. ఉదయం 6 గంటలకు సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఓట్లు లెక్కింపు, ఈవీఎంలలో సమస్యలు ఎదురైతే వెంటనే ఆర్వో దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కౌంటింగ్ పూర్తయి, రిజల్ట్ సర్టిఫికేట్ జారీ అయ్యే వరకు కౌంటింగ్ సిబ్బంది వెళ్లడానికి అవకాశం లేదని, ఆర్వో అనుమతితో మాత్రమే వెళ్లాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిప్యాట్లు, ఈవీఎంలు, సంబంధించిన సర్టిఫికెట్లు, లెక్కింపునకు సంబంధించిన పత్రాలు, సర్టిఫికెట్లపై రిహార్సల్స్ నిర్వహించి కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ పెద్దాపురం సెగ్మెంటుకు సంబంధించిన ఆర్వో సన్యాసిరావు, పెద్దాపురం నియోజకవర్గ ఏఆర్వోలు కె. గోపాలకృష్ణ, జి. నరసింహరావు, మున్సిపల్ కమీషనర్లు బి.ఆర్. శేషాద్రి, నాగేంద్రకుమార్, ఎంపిడివోలు పి. ఉమా మహేశ్వరరావు, కె. స్వప్న, ఏవో నాంచారయ్య, కౌంటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads