లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరం

UPDATED 6th AUGUST 2018 MONDAY 5:30 PM

సామర్లకోట: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపటం చట్టప్రకారం నేరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక 29వ వార్డులో ఉన్న ది లారీ ఓనర్స్, వర్కర్స్ అసోసియేషన్ ఆవరణలో గత రెండు రోజులుగా జరుగుతున్న లారీ డ్రైవర్ల ఎల్ఎల్ఆర్ మేళా ముగింపు రోజైన సోమవారం ఉప ముఖ్యమంత్రి డ్రైవర్లకు ఎల్ఎల్ఆర్ అందచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డ్రైవింగు లైసెన్స్ తోపాటు హెల్మెట్ కూడా ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగు చేయకూడదని తెలిపారు. డ్రైవింగ్  నిబంధనలు తెలియకుండ వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనికి డ్రైవర్ కుటుంబంతో పాటు ప్రయాణికుల కుటుంబాలు కూడ వీధిన పడుతున్నాయని అన్నారు. ప్రతీ డ్రైవర్ డ్రైవింగ్  లైసెన్స్ కలిగి ట్రాఫిక్ రూల్సును పాటిస్తూ ప్రయాణించాలని, అతివేగం అనర్ధదాయకమని అన్నారు. 18 సంవత్సరాలు నిండకుండా తల్లిదండ్రులు వారి పిల్లలకు వాహనాలు నడిపే స్వేచ్చను ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా అర్హత గల ప్రతీ వారికి డ్రైవింగు లైసెన్సు అంద చేయాలనే ఉద్దేశ్యంతో లైసెన్సు మేళాను ఏర్పాటు చేసి, ప్రమాదాలు సంభవించకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. లారీ అసోసియేషన్ భవనానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేళాలో 300 మంది వాహనదారులకు ఎల్ఎల్ఆర్ మంత్రి చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమానికి ముందు సామర్లకోట మెయిన్ రహదారి ప్రక్కన మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్ శిరీష, శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, మోటారు వాహనాల ఇనస్పెక్టర్లు పద్మాకరరావు, ఐశ్వర్య, కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్యం రాజబాబు, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.
ads