సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేయాలి

UPDATED 27th NOVEMBER 2020 FRIDAY 8:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా అంకితభావంతో, నిజాయితీగా విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి. రాజకుమారి తెలిపారు. గ్రామ సచివాలయం క్యాటగిరి-1కు సంబంధించి వెల్ఫేర్, ఎడ్యుకేషన్ సహాయకుల ఉద్యోగాలకు ఎంపికైన 59 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆమె శుక్రవారం అందచేశారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ లబ్ధిదారునికి అందేలా వెల్ఫేర్,ఎడ్యుకేషన్ సహాయకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకుని గ్రామ సచివాలయం స్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలో నేరుగా ప్రజలకు సేవలు అందించే గొప్ప అవకాశం ఉందని, విధి నిర్వహణలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలని అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జెడి జె. రంగలక్ష్మీదేవి, బీసీ వెల్ఫేర్ డీడీ కె. మయూరి, డీఎస్ డబ్లువొ టి. గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.

 

ads