వేడుకగా అరుంధతీ నక్షత్ర దర్శనం

* రావణ, పొన్న వాహనాలపై విహరించిన స్వామి, అమ్మవార్లు
* ఘనంగా ప్రధాన, ప్రవేశ, స్థాలీపాక హోమాలు

UPDATED 16th MAY 2019 THURSDAY 10:00 PM

అన్నవరం: అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన గురువారం రాత్రి అరుంధతీ నక్షత్ర దర్శన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రాత్రి 7 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన ఆలయం నుంచి తూర్పు రాజగోపురం ప్రాంగణానికి తీసుకువచ్చి అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించారు. సాయంత్రం అయిదు గంటలకు దర్బారు మండపంలో అర్చకులు, పండితులు, పురోహితుల బృందం ఆధ్వర్యంలో ప్రధాన, ప్రవేశ, స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించే గ్రామోత్సవాల్లో అతి ముఖ్యమైన రావణ వాహన సేవ, పొన్నచెట్టు వాహన సేవలు రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను సుందరంగా అలంకరించిన రావణ, పొన్నవాహనాలపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం ఛైర్మన్‌ రాజా ఐ.వి. రోహిత్‌, ఈవో ఎం.వి. సురేష్‌బాబు తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

 

 

ads