నిబంధనల ప్రకారం అధికారులు ప్రజలకు సేవలందించాలి

UPDATED 20th JUNE 2019 THURSDAY 8:00 PM

పెద్దాపురం: నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు నియమ నిబంధనలు అనుసరించి ప్రజలకు సేవలు అందించాలని పెద్దాపురం ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ హాలులో ఎంపిపి గుడాల రమేష్ అధ్యక్షతన మండలస్థాయి అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన పనులను నియమ నిబంధనలకు లోబడి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ద్వారా తిరిగి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఇంకా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి అధికారులు కృషి చేయాలని, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసిన వాటికి బిల్లులకు సంబంధించిన సొమ్ము త్వరగా వచ్చేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనులకు మంజూరు చేసిన రూ.50 కోట్లు మిగిలి ఉన్నాయని, వీటికి ప్రభుత్వ మంజూరు ఉత్తర్వులు వస్తే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున గ్రామాల్లో పారిశుద్యం, మంచినీరు పరిశుభ్రతకు పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని తెలిపారు. ఇక నుంచి నియోజకవర్గంలో పట్టణాలు, గ్రామాలు, పాఠశాలలు,  అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలలో పారిశుధ్యం, త్రాగునీరుపై తనిఖీ చేస్తానని తెలిపారు. బెల్టుషాపులు మూసివేత, సారా అరికట్టడంలోను ఎక్సయిజ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అనంతరం మండల స్థాయిలో వివిధ శాఖలైన వ్యవసాయ, ఆరోగ్య, లేబర్, ఐసిడిఎస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్&బి, ఎస్ఆర్ఇజిఎస్, ఆర్.డబ్యు.ఎస్, ఎక్సయిజ్, హౌసింగ్, వెటర్నరీ, ఎలక్ట్రికల్, మండల పరిషత్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ను ఎంపిపి గుడాల రమేష్, స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునరావు, ఎంపిడివో పి. ఉమామహేశ్వరరావు, తహసీల్దార్ కె. గోపాలకృష్ణ, సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads