పోలియో రహిత జిల్లాగా తూర్పుగోదావరి

* జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి

UPDATED 19th JANUARY 2020 SUNDAY 8:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి పోలియో రహిత తూర్పుగోదావరి జిల్లాగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ డి. మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంజయ్‌నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియోను నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. జిల్లాలో 4,65,195 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారని, వీరందరికీ వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,866 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామని, అలాగే బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో బూత్‌లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ జనాభా ఉన్నప్పటికీ 949 సెంటర్లు, 140 మొబైల్‌ టీములు ఏర్పాటు చేసి 27 వేల మంది చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే మత్స్యకార ప్రాంతాల్లోను, ఇటుక బట్టీలు, హైరిస్క్‌ ప్రాంతాలలో పక్కా ప్రణాళికతో పోలియో చుక్కలు వేయించనున్నామన్నారు. 387మంది సూపర్‌వైజర్లు, 15 వేల మంది టీమ్‌ సభ్యులు ఈ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్-2  జి. రాజకుమారి, డీఎంహెచ్‌వో డాక్టర్ బి. సత్య సుశీల, కాకినాడ నగర మేయర్ సుంకర పావని, మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ కె. రమేష్, డీఐవో వైవి భారతి, ఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రశాంత్‌, ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ మల్లిక్‌, తదితరులు పాల్గొన్నారు.    

ads