విద్యార్థులు మేధోశక్తితో అద్భుత విజయాలు

UPDATED 18th JUNE 2018 MONDAY 9:30 PM

రాజానగరం: విద్యార్థులు మేధోశక్తితో అద్భుత విజయాలు సాధించవచ్చని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి. అశోక్ అన్నారు. గైట్ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం తరగతులు సోమవారం ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ వల్లీ మాధవి అధ్యక్షతన విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ హాజరైనారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో కలలు కంటారని వాటిని సాకారం చేయాల్సిన గురుతర భాద్యత విద్యార్థులపై ఉందన్నారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ, చదువును ప్రేమిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి విద్యార్థులుగా మెలుగుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంచి విద్యార్థులే నేటి సమాజానికి అవసరమన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని, కళాశాలలో ఉన్న చక్కని వాతావరణాన్ని వినియోగించుకుని సమర్ధవంతులైన భావిభారత విద్యార్థులుగా తయారు కావాలని ఆయన కోరారు. గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు మాట్లాడుతూ నేటి సమకాలీన సాంకేతిక రంగాలకు అనుబంధమైన కోర్సుల్లో చక్కని పరిజ్ఞానం, నైపుణ్యం, పెంపొందించి గైట్ డిగ్రీ కళాశాల, విద్యార్థుల భవితవ్యానికి చక్కని బాట వేయనుందని తెలిపారు. ఈ సందర్భంగా గైట్ డిగ్రీ కళాశాల తరఫున రిజిస్ట్రార్ డాక్టర్ అశోక్, గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మి శశివర్మ, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ సుబ్బరాజులను ప్రిన్సిపాల్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేశారు.

ads