తెలుకుల కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి

UPDATED 13th AUGUST 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణంలో రూ.10 లక్షలతో తెలుకుల కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక తెలుకుల వీధి రామాలయం వద్ద అఖిల గాండ్ల, తెలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సత్కార సన్మాన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ తెలుకుల కులస్థులకు రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తానని, దీనికి సంబంధించిన స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చే విధంగా ప్రణాళికలను రూపొందించి ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారని అన్నారు. బిసి వర్గాలకు ఆదరణ పధకం ద్వారా పనిముట్లు, రుణాలు అందచేస్తున్నట్లు చెప్పారు. నాలుగు సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయడం జరిగిందని, పేదలకు ప్రభుత్వపరంగా ఆరోగ్యం, ఇళ్ళు, పింఛన్లు అండగా ఉన్నాయని చెప్పారు. సామర్లకోట పట్టణంలో 1500 గృహాలు పూర్తవుతున్నాయని, మరో 1500 గృహాలు నిర్మాణానికి జిల్లా జాయింటు కలెక్టరుతో సంప్రదించి 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రిని సంఘ సభ్యులు, ప్రజలు మంత్రిని గజమాలతో ఘనంగా సన్మానించి గౌతమ బుద్ధుడు ప్రతిమను అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, భీమేశ్వర దేవస్దానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఎస్సీ, ఎస్టీ సెల్ విజలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు బడుగు శ్రీకాంత్, మన్యం చంద్రరావు, 9, 11 వార్డు కౌన్సిలర్లు కె. సుష్మామోహిని, ఆర్. కస్తూరి అప్పారావు, రాష్ట్ర అఖిల గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు సింగవరపు సాయిబాబు, అంబటి శివస్వరూప్, చిప్పాడ వెంకటరమణ, అంబటి రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

ads