బాల్య వివాహాలు చట్టప్రకారం నేరం

UPDATED 1st OCTOBER 2018 MONDAY 5:30 PM

పెద్దాపురం: బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని దీనిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. మండలంలోని కట్టమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆర్డీవో సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాల వాతావరణాన్ని, హాజరు పట్టీని, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పదవ తరగతి ఉత్తీర్ణతా శాతం, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం తదితర అంశాలపై ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ కట్టమూరు గ్రామంలో బాల్యవివాహాలు జరుగుతున్నాయని, ఇవి చట్టప్రకారం నేరమని దీనికై విస్త్రతస్థాయిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే పోలీసు, రెవెన్యూ, ఐసిడిఎస్ అధికారులకు తెలియచేయాలని అన్నారు. గత సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణత శాతం అనుకున్న స్థాయిలో లేదని, దీనిని పెంచడానికి కృషి చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియచేసి పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. చిన్నిబాబు (ఇన్చార్జి), ఉపాధ్యాయులు శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.

 

ads