సేవభావం, క్రమశిక్షణ ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రధాన లక్ష్యం

* మేజర్ జనరల్ ఆర్.కె.సింగ్
* ముగిసిన ఎన్‌సీసీ జాతీయ సమన్వయ శిబిరం

UPDATED 22nd OCTOBER 2019 TUESDAY 9:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): కష్టపడే తత్వం, తోటివారికి సాయపడటం, క్రమశిక్షణ ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రధాన లక్ష్యమని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్.కె.సింగ్ అన్నారు. గత 11 రోజులుగా స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక జాతీయ సమన్వయ శిబిరం ముగింపు రోజైన మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్ల వందన స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం, సేవాభావం, శారీరక ధారుడ్యం, దేశభక్తి ఎన్‌సీసీ ద్వారా కలుగుతుందని తెలిపారు. దేశ సంపద, దేశాభివృద్ధి, మాతృభూమి పరిరక్షణలో యువతదే కీలకపాత్రని పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాగాలాండ్ నుంచి ముంబై వరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్యాడెట్లను ఆయన అభినందించారు. ఈ శిబిరంలో పాల్గోవడం వల్ల వివిధ రాష్ట్రాల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాడెట్లు నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం శిబిరంలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ కె.వి. శ్రీనివాస్, 18 ఆంధ్ర బెటాలియస్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ సింగ్, క్యాంప్ డిప్యూటీ కమాండర్, 19 ఆంధ్ర బెటాలియస్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ లీలాధర్, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్‌సీసీఆఫీసర్లు, పిఐ స్టాఫ్, సివిల్స్ స్టాఫ్, నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. మునిరామయ్య,  తదితరులు పాల్గొన్నారు. 

 

ads