కార్పోరేట్ స్థాయి వైద్యసేవలకు కాకినాడ జిజిహెచ్

* రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణారావు

UPDATED 5th FEBRUARY 2020 WEDNESDAY 10:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): కార్పోరేట్ స్థాయిలో వైద్యసేవలను అందిస్తున్న కాకినాడ జిజిహెచ్ ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు. స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కాకినాడ జిజిహెచ్ 163వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి మోపిదేవి, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథులుగా బుధవారం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అతి పురాతనమైన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి  రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి వైద్య సేవలను అందిస్తూ గొప్ప కీర్తి గడించిందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధిక సంఖ్యలో రోగులు ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు పొందుతున్నారని, ఎంతో అనుభవజ్ఞులైన  నైపుణ్యం గల వైద్యుల పర్యవేక్షణలో పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించడం జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ రెండు రంగాలను పూర్తిగా ప్రక్షళన చేయడమే కాకుండా బడ్జెట్ తో సంబంధం లేకుండా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఒక సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలంటే అందులో పనిచేసే ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తే గానీ ఆ సంస్థకు మంచి పేరు రాదనీ, అదే విధంగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, దాని అనుబంధంగా ఉన్న రంగరాయ వైద్య కళాశాల వైద్య రంగంలో గొప్ప పేరు గడిచాయని, ప్రస్తుతం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని 2400 పడకల వరకు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఇక్కడ వైద్యశాలలో సేవలు అందిస్తున్న వైద్యులు దేశ, విదేశాలలో ఎంతో  గొప్ప పేరును గడించారని, ఆసుపత్రి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ పక్షంగా కృషి చేస్తామని, కాకినాడ నగరాన్ని  మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన  తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు, అతిధులు సంయుక్తంగా సావనీర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఇళ్ళ వెంకటేశ్వరరావు, చిక్కాల రామచంద్రరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, కాకినాడ మేయర్ సుంకర పావని, డిసిసిబి ఛైర్మన్ అనంతబాబు, డిఎస్ఎంఎస్ ఛైర్మన్ దున్నా జనార్ధనరావు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పద్మ శశిధర్, డాక్టర్ గిరిధర్, ఎపిఎన్జిఓ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, కార్పోరేటర్ ఎస్. లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.


   

ads