మహిళా సంఘాలు బలోపేతానికి ప్రభుత్వం కృషి

UPDATED 30th JULY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మున్సిపాల్టీ పరిధిలో రూ. 30 లక్షలతో నూతనంగా నిర్మించిన స్త్రీశక్తి భవనం, అలాగే బలుసుల పేటలో రూ. 83 లక్షలతో అంగన్వాడీ భవనాలకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్ర సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ద్వారా బాలసంజీవిని కార్యక్రమంలో భాగంగా ఉయ్యాలను ప్రారంభోత్సవం చేసి గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లను మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సామర్లకోట మున్సిపాల్టీ పరిధిలో మహిళా సంఘాలకు రూ. 11 కోట్లు రుణాలను బ్యాంకులు ద్వారా అందచేశామని తెలిపారు. సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి రూ. 30 లక్షలతో స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ భవనం మహిళా శక్తి సంఘాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసి ఆదుకున్నారని, ఆర్థికంగా పెట్టుబడి పెట్టి వస్తువులను తయారుచేసే మహిళా శక్తి సంఘాల గ్రూపులకు వాటిని విక్రయించే విధంగా డ్వాక్రా బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. బాలసంజీవిని ప్రత్యేక పోషణ కార్యక్రమం ద్వారా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, సాధారణ కేటగిరి జనాభాలో గర్బిణీ, బాలింత మహిళలు, ఆరు సంవత్సరముల లోపు పిల్లలు పోషణ స్థితి మెరుగుదలకు అదనపు పోషకాహారం అందించే కార్యక్రమమే బాలసంజీవిని అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టడానికి అవసరమైన పోషక విలువలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పరీక్షలు, డెలివరీ, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా రవాణా సౌకర్యం, పుట్టిన బిడ్డకు బేబీకిట్, పారితోషికం అందచేస్తున్నామని చెప్పారు. అనాథలైన పిల్లలను ప్రభుత్వం ఆదుకునే విధంగా ఉయ్యాల ఏర్పాటు చేసి ఆ  పిల్లలను ప్రభుత్వమే దత్తత తీసుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమంపై అంగన్వాడి కార్యకర్తలు విస్తృతంగా  ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఆర్థిక అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి. మేఘనాదేవి, ఎంపిపి ఎ. సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కుమారరామ భీమేశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, మెప్మా సుజాత, సిడిపివో  పద్మావతి, వార్డు కౌన్సిలర్లు, మహిళలు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ads