పెట్రో ధరలపై భగ్గు

UPDATED 10th SEPTEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. ఇందుకు ప్రజలు, వివిధ సంఘాలు మద్దతుగా నిలిచాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. మధ్యాహ్నం వరకు దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరవలేదు. చాలా వరకు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను నాయకులు మూయించారు. స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద మోటార్ సైకిల్ ను తాడుతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి (బాబు) మాట్లాడుతూ పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్యుడికి వాహనం భారంగా మారుతోందని, రోజుల వ్యవధిలోనే ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా డీజిల్‌, పెట్రోల్‌ ధరలను పెంచుతున్నారని మండిపడ్డారు. తద్వారా రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. సామాన్యుడు పెట్రోల్‌ వాహనం నడపలేని పరిస్థితి దాపురిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అత్తిలి సీతారామస్వామి, ఎస్. ఉదయ్ కుమార్, తుమ్మల ప్రసాద్, సరోజ్ వాసు, సిహెచ్ నాగేశ్వరరావు, జి. నానాజీ, ఎండి షఫీయుల్లా, మార్తాండ్ ఠాగూర్, తోట సాయి, రహీమ్, సిపిఎం, సిపిఐ నాయకులు నాయకులు కరణం ప్రసాదరావు, కరణం సత్యనారాయణ, బాలం శ్రీనివాస్, చల్లా మహేష్, విప్పర్తి కొండలరావు, పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఎలిశెట్టి రామదాసు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

ads