భక్తుల మనోభావాలను పరిరక్షించడమే ప్రభుత్వ ధ్యేయం

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి వేణుగోపాలకృష్ణ

UPDATED 27th DECEMBER 2020 SUNDAY 9:00 PM

అమలాపురం (రెడ్ బీ న్యూస్): భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు అగ్నికి ఆహుతి అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన రథాన్ని తయారు చేయించి స్వామి వారి కళ్యాణానికి సిద్ధం చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. అంతర్వేదిలో నిర్మాణం పూర్తయిన స్వామి వారి నూతన రథాన్ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, అమలాపురం సబ్-కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తో కలిసి మంత్రి ఆదివారం  పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన దురదృష్టకర సంఘటనలో స్వామివారి రథం దగ్ధం కావడంతో ముఖ్యమంత్రి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేసి నూతన రథ నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. నూతన రథ నిర్మాణానికి అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ చైర్మన్ గా దేవాదాయ శాఖ ఏడిసి, తదితరులతో కమిటీ ఏర్పాటు చేసి శరవేగంగా నూతన రథాన్ని నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు. డిసెంబర్ 30వ తేదీకి నూతన రథాన్ని సిద్ధం చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు, ఆశాఖ ఇంజినీరింగ్ అధికారులు, శిల్పి గణపతి స్థపతి మాట ఇచ్చి శరవేగంగా సెప్టెంబర్ 27వ తేదీన పనులు ప్రారంభించి చెప్పిన సమయాని కంటే ముందే ఏడు అంతస్తులతో నూతన రథాన్ని సిద్ధం చేశారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నాయకత్వంలో సబ్-కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు, శిల్పి రథాన్ని త్వరితగతిన పూర్తి చేసినందుకు ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. రథారూఢుడైన శ్రీమహా విష్ణువును దర్శించుకుంటే పుణ్యం వస్తుందని, పునర్జన్మ ఉండదనే భక్తుల మనోభావాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి నూతన రథ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడంతో బాటు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేశారని తెలిపారు. భీష్మ ఏకాదశి పర్వదినానికి అన్ని హంగులతో నూతన రథాన్ని సిద్ధం చేసి రథసప్తమి పర్వదినం నాడు ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలియచేశారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన రథ నిర్మాణాన్ని దేవాదాయ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, శిల్పి ఒక ఛాలెంజ్ గా తీసుకుని సకాలంలో నూతన రథాన్ని సిద్ధం చేశారని, స్వామి వారి ఆశీస్సులతో ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని పనులు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్-కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఎస్సీ మాల కార్పోరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ, దేవాదాయ శాఖ ఏడిసి రామచంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.

ads