నిర్దేశిత లక్ష్యాలను సకాలములో పూర్తి చేయాలి

UPDATED 4th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM

రంపచోడవరం: ప్రాథమికరంగ సెక్టారులో ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు నిర్దేశిత లక్ష్యాలను సకాలములో పూర్తి చేయాలని లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని ఐటిడిఎ పివో నిషాంత్ కుమార్ హెచ్చరించారు. స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పలు అభివృద్ధి, సంక్షేమ అంశాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కొరకు ప్రతిపాదించిన 2,500 ఎకరాల లక్ష్యాల పనులను సకాలములో వేగవంతం చేయాలని, అలాగే  అధికారులకు లక్ష్యాలను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. వెలుగు ద్వారా ఈ ఏడాదిలో 3500 ఎకరాలలో నాటిన జీడిమామిడి, ఇతర ఉద్యాన పంటలకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాలను అమలు చేయాలని, అలాగే ఆయా పంటలకు డ్రిప్ ఇరిగేషన్ వసతుల కల్పనకై చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ ఉద్యాన విభాగాల ద్వారా వ్యవసాయాంత్రీకరణ పరికరాలు  రైతాంగానికి అందించేలా లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకొని లబ్దిదారులును ఎంపిక చేయాలని, ఈ జాబితాను ఈనెల 7వ తేదీనాటికి సమర్పించాలన్నారు. పశు సంవర్ధకశాఖ ద్వారా నిర్దేశిత ప్రాంతాలలో గోకులాలు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని, గో ఆధారిత కషాయి సహిత ప్రకృతి వ్యవసాయాన్ని గిరిజన రైతాంగంచేత  పెద్దఎత్తున అచరింపజేయడానికి కృషి చేయాలన్నారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి గిరిజన ప్రాంతం అనువైందని,  గోసంతతి కూడా ఇందుకు ప్రధానంగా దోహదపడుతుందన్నారు. నాణ్యమైన లాభసాటి ఉత్పత్తులు సాధించేలా సహజ సిద్ద వనరులతో సేద్యవిధానాలను అమలు చేయించాలన్నారు. ప్రకృతితో మమేకమై జీవనం సాగించే గిరిజన రైతాంగానికి పెట్టుబడి లేని ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ విధానాలు కలిసివచ్చి లాభసాటిగా మారినట్లు ఇటీవల దిగుబడులు నిరూపించాయన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్ని చేపల చెరువులు ఉన్నాయి., వాటిలో ఏమేరకు చేపపిల్లలు పెంచడానికి అవసరమౌతాయో అంచనాలు రూపొందించి మత్స్యశాఖ సంయుక్త సంచాలకులకు నివేదించి ఆమేరకు అనుమతులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపివో పి.వి.ఎస్. నాయుడు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రాబర్ట్ పాల్, డి. శ్రీనివాసరెడ్డి, పిహెచ్ఓ వై. సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకులు రమేష్ నాయక్, ఏపిడివో వర్మ, తదితరులు పాల్గొన్నారు. 

ads