UPDATED 19th JUNE 2019 WEDNESDAY 9:00 PM
కాకినాడ: భారత్‌మాల పథకంలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి అన్నవరం వరకూ పారిశ్రామిక అభివృద్ధి అవసరాలకు జాతీయ రహదారితో పోర్టు అనుసంధానం నిమిత్తం ప్రతిపాదించిన బీచ్‌రోడ్ ప్రాజెక్టు కోసం సర్వే, అలైన్మెంట్ ప్రక్రియలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కోర్టు హాలులో భారత్‌మాల బీచ్ రోడ్ ప్రాజెక్టుపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు, కన్సెల్టెంట్లతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. కాకినాడ పోర్టును, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రాంత సత్వరాభివృద్ధి లక్ష్యంగా కాకినాడ పోర్టు నుంచి అన్నవరం వద్ద ఎన్‌హెచ్-16ను కలుపుతూ రూ.వెయ్యి కోట్ల అంచనాతో భారత్‌మాల బీచ్ రోడ్ రహదారి ప్రాజెక్టును ప్రతిపాదించడం జరిగిందని ఎన్‌హెచ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సుమారు 40 కిలోమీటర్లు నిడివితో టెక్నికల్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదిత రోడ్ ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసిందని, రోడ్డు అభివృద్ధికి 860 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 719 ఎకరాల మేరకు సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. ఐదు ప్రదేశాల్లో 13.5 కిలోమీటర్ల రోడ్డు స్ట్రెచ్ అలైన్‌మెంట్‌కు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు, వ్యతిరేకత ఎదురవుతోందని అన్నారు. కొంతమంది ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఈ కారణంగా భూసేకరణ ప్రక్రియ జాప్యం కలుగుతోందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదిత రోడ్ ప్రాజెక్టులో భూసేకరణకు అవుతున్న వ్యయాన్ని, జనావాసాలపై ప్రభావాన్ని తగ్గించే రీతిలో ప్రాజెక్టు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 సిహెచ్ సత్తిబాబు, ఎన్హెచ్ఏఐ అధికారులు మాధవన్, రోహిత్, కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.