పట్టు పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం

* రైతుల బకాయిల చెల్లింపునకు చర్యలు
* రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు

UPDATED 24th SEPTEMBER 2019 TUESDAY 9:00 PM

గొల్లప్రోలు(రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందించి మేలైన పట్టు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మంగళవారం జరిగిన పట్టు రీలర్లు, పట్టు రైతుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక వనరులు ఉన్నాయని, ఇంతవరకు అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పరిమితమైన పట్టు పరిశ్రమ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుందని అన్నారు. పట్టు పరిశ్రమ ద్వారా రైతులకు నెలసరి ఆదాయం లభిస్తుందని, భవిష్యత్తులో పట్టును చైనా, బెంగుళూర్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నారు. రాష్ట్రంలో మల్బరీ తోటల పెంపకాన్ని ఉపాధి హామీ పధకం ద్వారా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అలాగే పట్టు రైతులకు రావలసిన రూ.1.23 కోట్లు రాయితీ బకాయిలను త్వరలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు. చేబ్రోలు గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో పట్టు శిక్షణా కేంద్రం, రూ.50 లక్షల వ్యయంతో షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో రైతు భరోసా పథకం  క్రింద ప్రతీ ఏటా రూ.12,500/- నాలుగు సంవత్సరాల పాటు రైతులకు అందజేస్తామని, అలాగే రైతు భీమా పధకం క్రింద మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.2 వేల కోట్లు కేటాయించామని, ఇన్ పుట్ సబ్సిడీ బకాయిలను త్వరలో చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు.
సెంట్రల్ సిల్క్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ రజిత్ రంజన్ ఒకాండియార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యత గల పట్టు ఉత్పత్తి జరుగుతుందని, ఈ పట్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే విదేశాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పట్టు మూలంగా పట్టు దిగిమతి తగ్గుతుందన్నారు. పట్టు పరిశ్రమ ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సెరీకల్చర్ అసిస్టెంట్లను నియమించడం హర్షణీయమని అన్నారు. చేబ్రోలులో ఏర్పాటు చేసిన పట్టు ఆటోమేటిక్ సిల్క్ రీలింగ్ యూనిట్ ద్వారా 1000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2,300 ఎకరాల్లో మల్బరీ సాగు జరుగుతుందని, ఇటీవల చింతూరులో ఏర్పాటు చేసిన టసర్ సిల్క్ ద్వారా గిరిజన రైతులు ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. రాష్ట్ర సెరికల్చర్, హార్టీకల్చర్ శాఖల కమీషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ రాష్ట్రం పట్టు ఉత్పత్తిలో దేశంలో రెండవ స్థానంలో ఉందని, రాష్ట్రంలో 400 మంది సెరికల్చర్ అసిస్టెంట్ల నియామకం జరుగుతుందని కూడా తెలిపారు. 
సెరీకల్చర్ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ సుభాష్ నాయక్ మాట్లాడుతూ దేశంలో 91 ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు పని చేస్తున్నాయని, వీటిలో తొమ్మిది రాష్ట్రంలో ఉన్నాయని, చేబ్రోలులో ఏర్పాటు చేసిన అటోమెటిక్ రీలింగ్ కేంద్రాల ద్వారా రోజుకు 240 కేజీలు రా సిల్క్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పన రామ్మోహన్ రావు, సెరికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ పి.యం.యు. రామరాజు, శాస్త్రవేత్తలు, అధికారులు రైతులు పాల్గొన్నారు.

 

 

ads