ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

* జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి
* స్పందన కార్యక్రమానికి 528 అర్జీలు

UPDATED 20th JANUARY 2020 MONDAY 6:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలక్టర్ డి. మురళీధరరెడ్డి  అధికారులను ఆదేశించారు. స్థానిక కలక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 528 మంది అర్జీదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలక్టర్ మురళీధరరెడ్డి మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ-450, సివిల్ సప్లయి-4, రూరల్ హౌసింగ్-10, ప్రజాసాధికార సర్వే-6, ఆధార్-18, డిఆర్డీఏ పింఛన్లు-16, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్-13, వైఎస్ఆర్ భీమా-10, హౌసింగ్-1 చొప్పున ప్రజల నుంచి అర్జీలు వచ్చాయని అన్నారు. 

మండపేటకు చెందిన యడ్ల కోమలరాణి తన తల్లికి ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసి 2009వ సంవత్సరంలో పట్టా ఇచ్చారని తల్లి మరణించినందున పట్టా తన పేరున మార్చి స్థలం చూపించాలని అర్జీని అందజేయగా మండపేట తహసిల్దారును తగు చర్యలు చేపట్టాలని కలక్టరు ఆదేశించారు.

బోరుతో ఉప్పునీరు రొయ్యల చెరువులు సాగు చేస్తున్నందున వరి, కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయని రొయ్యల సాగు నిలుపుదల చేయాలని పి. గన్నవరం మండలం రాజులపాలెం గ్రామస్థులు ఫిర్యాదు చేయగా మత్స్యశాఖ జెడిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కాకినాడకు చెందిన పితాని రాము ఎర్రబాట ఎడిటర్ సర్పవరం ఎన్.టి.ఆర్ విగ్రహం నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు గల రహదారి ఆక్రమణల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రహదారి ఇరువైపులా ఆక్రమించి మధ్యలో డివైడర్ కి అనధికార ఫ్లెక్సీలు పెడుతున్నారని, అలాగే ఎస్ఆర్ఎంటి మాల్ వద్ద అనధికార పార్కింగ్ చేస్తున్నారని వీటిని పరిష్కరించాలని ఫిర్యాదు చేయగా కాకినాడ మున్సిపల్ కమీషనర్‌, డిపిఓను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

సామర్లకోట మండలం జి.మేడపాడు గ్రామానికి చెందిన గోవా కాంతం తన తండ్రి మిలటరీలో పనిచేసి రిటైర్ అయ్యారని, ప్రభుత్వం వారు 2.30 ఎకరాల భూమి ఇచ్చారని, సదరు భూమిని సాగు చేసి రెండు పంటలు పండించుకొంటున్నామని, తన పొలాన్ని ఆక్రమించి మట్టి త్రవ్వి అమ్ముకుంటున్నారని న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా సామర్లకోట తహసిల్దారును విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్-2 జి. రాజకుమారి, బిసి కార్పోరేషన్ ఇడి ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  

 

ads