సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని దోహదం

* ఆర్డీవో వసంతరాయుడు

UPDATED 5th OCTOBER 2018 FRIDAY 5:30 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా చేరువవుతున్నాయో లేదో తెలుసుకోవడం కోసమే ప్రతీ గురు, శుక్రవారాల్లో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ అభివృద్ధి అధికారి, పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఇన్ ఛార్జ్ ఎంపిడివో జగ్గారావు అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్డీవో వసంతరాయుడు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, శాఖల పనితీరు తెలుసుకోవడం, సమస్యలు పరిష్కారానికి గ్రామదర్శిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 సంవత్సరములు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, దీనికోసం శని, ఆదివారాల్లో బిఎల్.వోలు పోలింగు కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తారని, ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఎంఎల్.సి ఎన్నికలకు సంబంధించి 2015 సంవత్సరం వరకు డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి తహసీల్దార్, ఎంపిడివో కార్యాలయాల్లో దాఖలు చేసుకోవచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుందని, దీనిని అరికట్టడానికి ప్రజల్లో చైత్యనం రావాలన్నారు. బాల్య వివాహాలు చట్టప్రకారం నేరమని అన్నారు. రోడ్లు, త్రాగునీరు, పారిశుద్యం, పింఛన్లు, రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, సాధికారమిత్ర పనితీరు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, చంద్రన్నభీమా క్లెయిములు, ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్న భోజన పథకం అమలు, రేషన్ దుకాణాలు పనితీరు, తదితర అంశాలపై గ్రామదర్శినిలో అధికారులు ప్రజలు సమక్షంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్ఇ సిహెచ్. అప్పారావు మాట్లాడుతూ మన ఇంటి శుభ్రంతోపాటు పరిసరాల శుభ్రతను ప్రజలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వం పారిశుద్యం విషయంలో ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందని అన్నారు. రోడ్డుపై చెత్తవేయకుండా, కేటాయించిన స్థలాల్లోనే వేయాలని, అలాగే బహిరంగ మలవిసర్జన చేయకుండా అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో  జగ్గారావు మాట్లాడుతూ గ్రామంలో రూ. 2 కోట్లు వరకు అభివృద్ధి పనులు చేశామని, ప్రజల సహకారంతో ఇంకా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. మండల ప్రత్యేకాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం అనేక పథకాలు వివిధ శాఖల ద్వారా అమలు చేస్తుందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆర్డీవో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి, విద్యార్థులను భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు, తదితర అంశాలు పరిశీలించారు. తదుపరి వర్మికంపోస్టు కేంద్రాన్ని ఎంపిడివోతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads