ఫార్మసీ విద్యార్థులకు ఆచరణాత్మక విజ్ఞానం అవసరం

UPDATED 17th AUGUST 2018 FRIDAY 5:30 PM

గండేపల్లి: ఫార్మసీ విద్యార్థులకు ఆచరణాత్మకమైన విజ్ఞానం అవసరమని డాక్టర్ జి. శ్రీనుబాబు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ఫార్మసీ రంగంలో జరుగుతున్న అభివృద్ధి, పారిశ్రామిక, ఉద్యోగ అవకాశాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సదస్సుకు ప్రముఖ కంపెనీ "పల్సస్" సిఇవో డాక్టర్ జి. శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన అనంతరం వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అనే గ్రామంలో జన్మించిన శ్రీనుబాబు తన మేధస్సు పెట్టుబడిగా ఒక సంస్థను స్థాపించి, నేడు పదివేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం గల స్థాయికి ఆ సంస్థను చేర్చిన మేధావని, అలాంటి వ్యక్తి మా సంస్థ విద్యార్థులతో తన అనుభవాలను పంచుకోవడానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్య అతిథి శ్రీనుబాబు మాట్లాడుతూ ఫార్మసీ రంగం నిత్యనూతనంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందని, వైద్య, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువ ఫార్మాసిస్టులు నూతన ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా అవతరించి పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆదిత్య యాజమాన్యం డాక్టర్ శ్రీనుబాబును దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. రవిశంకర్, ప్రొఫెసర్ వై. సురేంద్రనాధరెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, గోగినేని శ్రీనివాస్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads