ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేయాలి

UPDATED 11th MARCH 2019 MONDAY 8:00 PM

పెద్దాపురం: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు విడుదల కావడంతో ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేయాలని పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగు అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ఫ్లైయింగ్  స్క్వాడ్ స్టాటిక్ టీం, ఎకౌంట్ టీమ్, సెక్టార్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వసంత రాయుడు మాట్లాడుతూ ఎన్నికల విధులను ఎలక్షన్ కమీషన్ సూచనలు మేరకు తూచా తప్పకుండా పాటించాలని, విధుల్లో ఉన్న సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లరాదని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్ళకు తావులేకుండా కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. స్టాటస్టిక్ ఫ్లైయింగ్ టీముల విధులు చాల ముఖ్యమైనవని, వీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అధికారులు వీడియోల ద్వారా చిత్రీకరించాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు అకౌంట్స్  టీముకు తెలియచేయాలని తెలిపారు. నియోజకవర్గంలో 14 మంది సెక్టారు అధికారులను  కేటాయించామని, వీరు పోలింగు కేంద్రాలలో పర్యటించి గ్రూపులను గుర్తించడానికి పంచాయతీ కార్యదర్శుల  సహకారం పొందాలన్నారు. పోలింగు సిబ్బంది పోలింగు సామాగ్రితో పోలింగు కేంద్రాల దూరాన్ని గుర్తించి సెక్టారు అధికారులు సమాచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని తెలిపారు. సెక్టారు అధికారులకు, ప్లేయింగు స్క్వాడ్ కు ఫిర్యాదులు వస్తే 110 నిమిషములలో ఆ ఫిర్యాదును ఎలక్షన్ కమీషన్ కు పంపించాలని తెలిపారు. మోడల్ కోడ్ అమలును పగడ్బందీగా నిర్వహించాలని, దీనికి సంబంధించి స్థానిక ఎంపిడివో, కమీషనర్లకు బాధ్యత ఉంటుందని అన్నారు. పోలింగు స్టేషన్లలో శిలాఫలకాలు ఉంటే వాటిని కాగితాలతో మూసివేయాలని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలన్నారు. విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బందులు ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ  చిలకా వెంకట రామారావు, సహాయ రిటర్నింగు అధికారులు కె. గోపాలకృష్ణ, జి. నరసింహారావు, మున్సిపల్ కమీషనర్లు బి.ఆర్. శేషాద్రి, నాగేంద్రకుమార్, సెక్టార్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads