ఆదిత్యలో అధ్యాపక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం

UPDATED 25th MAY 2018 FRIDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో అధ్యాపక నైపుణ్యాభివృద్ధిపై వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సి.హెచ్. కృష్ణుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యాపరంగా సాధిస్తున్న అభివృద్ధి, సంస్కరణలు గురించి ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను పెంపొందించుకొంటూ విద్యార్థులకు బోధించాలని, అప్పుడే అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తారని సూచించారు. వేగంగా మారుతున్న నేటి విజ్ఞాన సమాజంలో అదే వేగంతో మనం సమాజాన్ని గమనిస్తూ సాగకపోతే వెనుకబడతామని, అధ్యాపకులు సరైన అవగాహన కలిగి విషయ పరిజ్ఞానముతో విద్యార్థులకు సులభతరంగా భోదిస్తూ వారిలో పరిపూర్ణమైన జ్ఞానం పెంపొందించవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డైరెక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులకు అధునాతన బోధనా పద్ధతులు, నైపుణ్యాలపై ఎప్పటికప్పుడు ఇటువంటి వర్క్ షాపులు నిర్వహించడం ద్వారా ఆదిత్య వారిలో నైపుణ్యాలను ద్విగుణీకృతం చేస్తోందని, తద్వారా మెరుగైన బోధనా పద్ధతులతో విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, ప్రొఫెసర్ మెహర్జి దువ్వూరి, ప్రొఫెసర్ టి. దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ads